
ప్రతి అడుగూ ప్రజల కోసమే.. వారి కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ నేనున్నాంటూ భరోసా ఇస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌కు వారధి నిర్మాణానికి మహా సంకల్పయాత్ర చేపట్టారు ప్రతిపక్షనేత వైఎస్ జగన. జననేత జనం కోసం అడుగులు వేస్తుంటే నీ వెంటే మేముంటాం అంటూ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 3,645 కిలోమీటర్ల యాత్ర మరో చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ప్రజలతో మమేకమవుతూ సాగిన ఈ యాత్ర నేడు ముగింపు ఘట్టానికి చేరుకుంది. ముఖ్యంగా జిల్లాలో కూడా నెల్లూరు నగరం మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఆ సమయంలో అశేష జనవాహిని జగన్ వెంట నడిచింది. పల్లెల్లో అపూర్వ స్వాగతం లభిం చింది. తమ సమస్యలను చెప్పుకున్నారు. టీడీపీ చేసిన మోసాన్ని ఏకరువు పెట్టారు. ముగింపు ఘట్టంలోనూభాగస్వాములు అయ్యేందుకు ఇచ్ఛాపురానికి తరలి వెళ్లారు. జిల్లాలో పార్టీ మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు,ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలతోపాటు మండల, గ్రామస్థాయి నాయకులు మంగళవారంబయలుదేరారు. జననేత పాదయాత్ర జిల్లాలోహాట్ టాపిక్‌గా మారింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ దూరాభారాన్ని లెక్కచేయకుండా అపూర్వ ఘట్టంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో మంగళవారం పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాకు తరలివెళ్లారు. ముఖ్యంగా పార్టీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.వరప్రసాద్‌రావు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ సమస్వయకర్తలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేరిగ మురళీధర్, పార్టీ తిరుపతి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు శ్రీకాకుళం పయనమయ్యారు. వీరిలో కొందరు మంగళవారం ఉదయానికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. అలాగే నెల్లూరు సిటీ, రూరల్, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి, సర్వేపల్లి, కోవూరు, సూళ్లూరుపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలివెళ్లారు.
జిల్లాలో ప్రజాసంకల్ప హోరు
ఆంధ్రా, తమిళనాడు సంప్రదాయ రీతుల్లో స్వాగతాల నుడుమ చిత్తూరు జిల్లా నుంచి కోస్తా జిల్లాలకు సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో వైఎస్ జగన్ పాదయాత్ర గతేడాది జనవరి 23న ప్రవేశించింది. యాత్ర ప్రారంభం మొదలు జిల్లాలో ముగింపు వరకు ఆశేష జనవాహిని జననేత వెంటే అడుగులు వేశారు. పాదయాత్రకు తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత జగన్ ముందుకుసాగారు. పూర్తిస్థాయిలో వ్యక్తిగత సమస్యలు మొదలుకొని జిల్లా సమస్యల వరకు అన్నింటినీ తెలుసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఒక్కరి కష్టాలను విని తానున్నానంటూ భరోసా ఇచ్చారు. జనవరి 23న పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో జిల్లాలో మొదటి అడుగుపడి ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో మలి అడుగుతో యాత్ర జిల్లాలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది.
తొమ్మిది నియోజకవర్గాల్లో పాదయాత్ర
జిల్లాలో సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరురూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో ఉన్న 142 గ్రామాల మీదుగా 266.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగించారు. అలాగే సూళ్లూరుపేటలో పెళ్లకూరు(చెంబేడు), నాయుడుపేట గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి(పొదలకూరు), నెల్లూరురూరల్(సౌత్ మోపూరు), కోవూరు(బుచ్చిరెడ్డిపాలెం), ఆత్మకూరు(సంగం), కావలి(దగదర్తి), ఉదయగిరి(కలిగిరి)లలో బహిరంగ సభలు నిర్వహించి అన్ని అంశాలతోపాటు నియోజకవర్గ ప్రధాన సమస్యలపైనా మాట్లాడారు అలాగే జిల్లాలో చేనేత, యాదవ, ఆర్యవైశ్య, ముస్లిం, మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గం ప్రత్యేక హోదా కీలక ప్రకటనలకు వేదికగా నిలిచింది. ప్రత్యేక హోదా భవిష్యత్తు కార్యచరణ ఇక్కడే రూపొందించి ప్రకటించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద 1000 కిలోమీటర్ల మైలురాయి దాటి విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం వద్ద 1100 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా 72 అడుగుల ఎత్తులో భారీపార్టీ జెండా ఆవిష్కరించారు. ఇలా జిల్లాలో జరిగిన పాదయాత్ర పలు ముఖ్య ఘట్టాలకు వేదికగా నిలిచింది.