మేము సైతం చరిత పుటల్లో భాగమై.. | YS Jagan Memories In Guntur Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

మేము సైతం చరిత పుటల్లో భాగమై..

Jan 9 2019 1:53 PM | Updated on Jan 9 2019 1:53 PM

YS Jagan Memories In Guntur Praja Sankalpa Yatra - Sakshi

ప్రజా సంకల్పాయాత్రలో భాగంగా గుంటూరులో జరిగిన సభకు హాజరైన జన సందోహం, అభివాదం చేస్తున్న జననేత జగన్‌ (ఫైల్‌)

అదిగో నవశకం.. ఈడ్చికొట్టే జడివానను చీల్చుకుంటూ.. ఎముకలు విరిచే చలిలో ఎదురీదుకుంటూ.. భగభగ మండే నిప్పుల కణికలపై సవారీ చేసిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పయనం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగి నవశకానికి నాంది పలికింది. తాను నడిచిన దారుల్లో బీద గుడిసె గుండెల్లో కన్నీటి తడిని ఆత్మీయంగా తుడిచేసి అభయ హస్తమిచ్చింది. అప్పుల అగాధంలో ఆత్మహత్యల ఉరికొయ్యకు వేలాడుతున్న రైతన్నను చూసి కరిగిపోయి.. పచ్చని పంటల్లో అన్నదాత నవ్వుల సిరిని పండిస్తానని భరోసా కల్పించింది. వేల కిలోమీటర్లు సాగిన ప్రజా సంకల్పం నేడు సరి కొత్త చరితను ఆవిష్కరించబోతోంది. దీనికి మేము సైతమంటూ విప్లవాల మల్లెలు విరబూసిన శ్రీకాకుళం గడ్డపై వజ్ర సంకల్పధీరునికి అభిమాన స్వర్ణ కంకణం అలంకరించేందుకు ఊరూవాడా జనవాహినై కదిలింది. సంకల్పధీరుడికి సలామంటూ తలొంచిన దారులు.. అభిమాన దండుకు అఖండ స్వాగతం పలకగా, జై జగన్‌ అనే నినాదం ఢమరుక నాదమై మార్మోగగా.. ఇచ్ఛాపురం గడ్డపై నేడు సంకల్ప మహోజ్వల దీప్తి దేదీప్యమానమై ప్రకాశించబోతోంది.

గుంటూరు(పట్నంబజారు): ప్రజా సంకల్పయాత్రికుడై బయలుదేరిన జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పాదయాత్ర నేడు ఇఛ్చాపురంలో నేడు ముగియనుంది. అభిమాన నేత వైఎస్‌ జగన్‌ బహిరంగ సభకు జిల్లా నుంచి ఆశేష జనవాహిని పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు, కార్లలో పాదయాత్ర ముగింపు సభకు తరలివెళ్లి జయప్రదం చేయనున్నారు. వైఎస్సార్‌ సీపీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలతో కలిసి మాచర్ల నియోజకవర్గం నుంచి ఇఛ్చాపురం చేరుకున్నారు. నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట మండలం, రొంపిచర్ల మండలం నుంచి పార్టీ నేతలతో కలిసి సభకు తరలివెళ్లారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ ముస్తఫా, నగర అనుబంధ విభాగాల నేతలు, డివిజన్‌ అధ్యక్షులతో కలిసి వెళ్ళారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి పాదయాత్రకు చేరుకున్నారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి నియోజకవర్గం, ఆయా మండలాల నేతలతో కలిసి కార్లతో పాదయాత్ర తరలివెళ్లారు.

అభిమాన తరంగం
గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి సభకు వెళ్లారు. పార్టీ గుంటూరు, సత్తెనపల్లి, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలు కిలారి రోశయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌లు పాదయాత్రకు పార్టీ నేతలు, కార్యకర్తలతోతో ఇచ్ఛాపురం చేరుకున్నారు. పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నేడు జరిగే బహిరంగ సభకు తరలివెళుతున్న బస్సును కిలారి రోశయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం పాదయాత్ర వెళ్లగా, లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయం నుంచి బస్సును ఏర్పాటు చేసుకుని సభకు తరలివెళ్లారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడె మేరుగ నాగార్జున వేమూరు నియోజకవర్గం, ఎస్సీ విభాగం నేతలను వెంట తీసుకుని బయలుదేరారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీ పార్టీ నేతలతో కలిసి వెళ్లారు.. గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, తాడికొండ, పెదకూరపాడు, పొన్నూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, నంబూరు శంకరరావు, రావి వెంకటరమణలు వారి నియోజకవర్గ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో కలిసి ప్రజా సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి పయనమయ్యారు.

న్యాయవాదుల సంఘీభావం
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మద్దతుగా గుంటూరు నగరంలో న్యాయవాదులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన ప్రదర్శన నగరంపాలెంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం ఆయన విగ్రహానికి, గుర్రం జాషువా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, లీగల్‌ విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యన్నారాయణ, లీగల్‌ విభాగం నగర అధ్యక్షులు వాసం సూరిబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలెదేవరాజులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement