
సమైక్యచాంపియన్ జగనే: ఎస్పీవై రెడ్డి
రాష్ట్రంలో సమైక్య చాంపియన్ తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కానే కాదని వైఎస్సార్ సీపీ నంద్యాల పార్లమెంట్ సమన్వయకర్త, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు.
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్రంలో సమైక్య చాంపియన్ తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కానే కాదని వైఎస్సార్ సీపీ నంద్యాల పార్లమెంట్ సమన్వయకర్త, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాసన సభలో మూజువాణి ఓటుతో విభజన బిల్లును వెనక్కి పంపించేలా చేసిన ఘనత వైఎస్సార్ సీపీకే దక్కుతుందన్నారు.
సమైక్యాంధ్ర కోసం... జైలులో ఉన్నా బయట ఉన్నా జగన్ మాత్రమే ఆమరణ నిరాహార దీక్షలు చేశారని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం కార్యాలయానికి నియోజకవర్గ సమస్యలను వివరించేందుకు తాను వెళ్లినమాట వాస్తవమేనని, అయితే అక్కడ ముఖ్యమంత్రి లేకపోవడంతో ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డిని మాత్రమే కలిసినట్లు తెలిపారు. కొందరు నాయకులు మీడియాకు డబ్బులు ఇచ్చి తనపై దుష్ర్పచారం చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ తనను అన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని, అలాంటి వ్యక్తితో తనకు విభేదాలు ఉన్నట్లు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.