నియామక పత్రాలు అందజేసిన సీఎం జగన్‌

YS Jagan Handed Over Appointment Letters To AP Grama Ward Sachivalayam Candidates - Sakshi

సాక్షి, విజయవాడ : ‘అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలి. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడొద్దు. మీ పని తీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దేశంలో ఇటువంటి ప్రయోగం ఎవరూ చేసి ఉండరు... మీరంతా కలిసి దీనిని విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం నాకుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్‌ సహా మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలు, తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో.. అత్యంత పారదర్శకంగా ఏకంగా ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం, ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం, లక్షా నలభై వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం.. ఇది నిజంగా ఓ రికార్డు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. ప్రతీ రెండు వేల జనాభాకు సచివాలయం పెట్టడం.. తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఉజ్జాయింపుగా ప్రతీ గ్రామానికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నా. ప్రతీ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం కూడా ఇచ్చాము. ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు’ అని పేర్కొన్నారు.

సొంత ప్రజల రుణం తీర్చుకోండి..
‘అమెరికా వెళ్లినా సొంత గడ్డకు ఏదో చేయాలని ఎంతో మంది తపన పడతారు. అలాంటిది సొంత మండలంలోనే ఉద్యోగం చేసే భాగ్యం మీకు దక్కింది. మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోండి. లంచాలు, వివక్షలేని పారదర్శక పాలన అందివ్వండి. వాలంటీర్లు, మీరు కలిసి పేదవాడి ముఖంలో ఆనందం తీసుకురండి. మనం అధికారం చేలాయించడానికి కాదు.. వారికి సేవ చేయడానికి ఉన్నాం. గ్రామాల్లో రేషన్ కార్డు నుంచి ఏది కావాలన్నా లంచం తీసుకునే పరిస్థితి ఉండేది. జన్మభూమి కమిటీలు వ్యవస్థను నాశనం చేశాయి. వాటి కారణంగా నేడు గ్రామాల్లో పాలనా వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉంది. అటువంటి పరిస్థితులను మన వ్యవస్థ ద్వారా మెరుగుపరచాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో 34 పనులు జరుగుతాయి. 72 గంటల్లోనే వారికి పరిష్కార మార్గం చూపేలా చర్యలు ఉంటాయి. మీరు చేసే సేవతో ప్రజల ముఖాల్లో వచ్చే చిరునవ్వును ఊహించుకోండి. ప్రతీ గ్రామ వాలంటీరుకు ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తారు. జనవరి 1 నుంచి పూర్తిగా 500 సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే విధంగా జనవరి 1 నుంచి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు వస్తాయి. అర్హత ఉన్నవారికి తప్పకుండా లబ్ది చేకూరాలి’ అని సీఎం జగన్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్దేశం చేశారు. అదే విధంగా ఇంత కష్టపడి నియామక ప్రక్రియ నిర్వహించిన ప్రతీ ఒక్క అధికారికి నా సెల్యూట్ అని అధికారులను ప్రశంసించారు.


సరికొత్త రికార్డు నెలకొల్పిన సీఎం జగన్‌
ఈ తరం యువతరానికి ఉన్న జీవితకాల లక్ష్యంగా మారింది ప్రభుత్వోద్యోగం. నాటి స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు అన్నింటి వెనుక ఉన్న బలమైన నినాదం కూడా అదే. ఏ ప్రభుత్వమైనా సరే శాశ్వత ఉద్యోగాలు కల్పించి ఉపాధి మార్గం చూపించాలని ప్రజలు నిత్యం కోరుకుంటారు. తెలంగాణ ఉద్యమం ప్రధాన నినాదాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నవి అత్యంత కీలకమైన్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో యువత ఉద్యమ బాట పట్టింది కూడా ఉద్యోగాల కోసమే. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు...అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం విప్లవ పార్టీల నుంచి విద్యార్థి సంఘాల వరకు నిత్యం పోరాటాలు చేస్తునే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి ఉద్యమాలు జరగకుండానే రికార్డు స్థాయిలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు నెలకొల్పారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాడు తాను చెప్పిన మాటను అక్షర సత్యం చేసి అక్టోబర్‌ 2 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి చూపిస్తున్నారు. తెలుగునేలపై సరికొత్త ఉద్యోగ విప్లవాన్ని సృష్టించి... అనతికాలంలోనే లక్షా 26 వేల 728 ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేసి చూపించి తాను ప్రజల మనిషి అని మరోసారి చాటుకున్నారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇన్ని ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నది గమనార్హం.

ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 వేల 158 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా 110 మున్సిపాలిటీల్లో 3,809 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో పనిచేయడానికి 95 వేల 88 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు, 33వేల 581 మంది వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులు పనిచేస్తారు. అంతేగాకుండా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది. ఉద్యోగి సొంత మండలంలో మరే గ్రామమైనా.. జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అదే విధంగా పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top