కుమ్మరి కుండలో వరాల ధార 

YS Jagan Give Ensure To Pottery Group In BC Declaration - Sakshi

సాక్షి, గుంటూరు : సమాజంలో మనిషి అవసరాలను తెలుసుకొంటూ, వారికి కావాల్సిన  వస్తువులకు రూపం ఇచ్చేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా కుమ్మర్ల కుల వృత్తిలో ఆటుపోట్లు తప్పడం లేదు. మట్టి నుంచి తమ చేతుల్లో ప్రాణంపోసుకున్న వస్తువులను కాల్చేందుకు అవసరమైన బొగ్గు వరకు అన్నింటి ధరలు పెరగడంతో వచ్చే ఆదాయం సరిపోక, వృత్తిని నమ్ముకోలేక.. ఇతర రంగాలకు మళ్లలేక సతమతమవుతున్నారు

ఒకప్పుడు మట్టి కుండలకు విపరీతమైన ఆదరణ ఉండేది. రానురానూ వాటికి ఆదరణ తగ్గిపోతోంది. కుండను తయారు చేయటానికి గంట సమయమే పట్టినా, వాటిని వేడిచేసి ఆరబెట్టడం ఒక పెద్ద ప్రక్రియ. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసంలో మినహా ప్రమిదలకు డిమాండ్‌ ఉండటంలేదు.  మార్కెట్‌లో కుండలు అమ్ముకొనే పరిస్థితి లేకపోవటంతో వచ్చిన ధరకు టోకు వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు. కొందరు  గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. రోజుకు రూ.300లకు మించి ఆదాయం రావడంలేదని వాపోతున్నారు.

వైఎస్‌ జగన్‌ హామీతో చిగురించిన ఆశలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో కుమ్మర్లకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటితో కుమ్మర్ల జీవితాల్లో ఆశలు చిగురించాయి. కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నామినేటెడ్‌ పోస్టులతోపాటు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఐదు సంవత్సరాలలో రూ.75 వేల లబ్ధి  కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిపై జిల్లాలోని 33 వేల కుమ్మర్ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

హామీలు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం
టీడీపీ ప్రభుత్వం కుమ్మర్లను ఓటు బ్యాంకుగా వాడుకొని వారికి ఇచ్చిన హామీలను విస్మరించింది. శాలివాహన కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తామని, కుమ్మర్లు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం కల్పించి, సొంతగా విక్రయాలు జరుపుకొనేలా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని, వృత్తి దార్లకు గుర్తింపు కార్డులు, విద్యార్థులకు రుణాలు, విదేశాల్లో చదువుకునే అవకాశం.. ఇలా ఎన్నో హామీలు గుప్పించింది. అయితే ఏ ఒక్కటీ అమలుకు నోచలేదు. ఆదరణ పథకం కింద కూడా ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదని కుమ్మర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఓటర్లు : 92,000
కుమ్మర్ల కుటుంబాలు : 32,500
కుమ్మర్ల జనాభా : 1,28,000
వృత్తి మీద ఆధారపడి జీవించేవారు : 9,000
వృత్తిపై రోజు వారి ఆదాయం : రూ.300

కుండలకు ఆదరణ లేదు
గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కుండలకు ఆదరణ కూడా లేదు. అన్ని విధాలుగా రేట్లు పెరిగిపోయాయి. గతంలో రైతుల పొలాల్లో ఉచితంగానే మట్టి తవ్వుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రూ.3 వేలు ఇవ్వాల్సి వస్తోంది. నమ్ముకొన్న వృత్తిని వదులుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కండలు తయారు చేయాల్సి వస్తోంది.
– కొల్లిపాక అంజయ్య, మంగళగిరిపాడు

సాహసోపేత నిర్ణయం
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తీసుకొంది సాహసోపేత నిర్ణయం. బీసీ డిక్లరేషన్‌ వల్ల ఉన్నతంగా చదువుకోవాలనే విద్యార్థులకు కార్పొరేషన్‌ నుంచి సాయం అందటమే కాకుండా విదేశాల్లో విద్యనభ్యసించే వారికి బ్యాంకుల నుంచి రుణాలు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం బీసీల గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అది ఒక్క జగన్‌కే సాధ్యం.
– డి.సాంబశివరావు, మంగళగిరిపాడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top