ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబే | YS Avinash Reddy Comments On Chandra Naidu YSR Kadapa | Sakshi
Sakshi News home page

ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకున్నది చంద్రబాబే

Aug 30 2018 8:21 AM | Updated on Aug 30 2018 8:21 AM

YS Avinash Reddy Comments On Chandra Naidu YSR Kadapa - Sakshi

మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చిత్రంలో వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా, నాయకులు

కడప కార్పొరేషన్‌: దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముస్లిం, మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, వాటికి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయించి అడ్డుకున్నది చంద్రబాబేనని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. బుధవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగైదు మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి మళ్లీ మైనార్టీలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ‘నారా హమారా, టీడీపీ హమారా’సభ నిర్వహించారన్నారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మైనార్టీల ప్రాతినిధ్యం లేని కేబినెట్‌ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉందని, ఒక్క ఎమ్మెల్యే లేని ఉత్తర ప్రదేశ్‌లో కూడా మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు.

నిన్నటి సీఎం సభలో విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపితే సీఎం వారివైపు వేలెత్తి చూపుతూ అంతుచూస్తానని బెదిరించడం దారుణమన్నారు. ముస్లింల స్థితిగతుల గురించి సీఎంగాని, టీడీపీ నాయకులుగాని సభలో మాట్లాడకపోవడం దౌర్భాగ్యమన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరన్నారు. వాజ్‌పేయి ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సానుభూతి ఓట్లు పడతాయనే 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారన్నారు. ఆ తర్వాత ‘బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశాను, నన్ను క్షమించండి’అని ముస్లింలను కోరిన చంద్రబాబు, 2004లో మోడీ హవా చూసి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మోసం చేశారని మండిపడ్డారు. 2002లో గుజరాత్‌ అల్లర్లు జరిగినప్పుడు మోదీని గుజరాత్‌లో అడుగుపెట్టనీయనని బీరాలు పలికిన చంద్రబాబు, అదే మోదీ కాళ్లు పట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ముస్లింలు ఉన్నారన్న సంగతే మరిచిపోయిన బాబు, ఇప్పుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ఎన్నికలు రావడానికి నాలుగు నెలలు మాత్రమే ఉందని, మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడానికే సీఎం ఇలా ఉత్తుత్తి వరాలు ప్రకటించారని తెలిపారు. ముస్లింలు వైఎస్‌ఆర్‌సీపీ వైపు ఉన్నారని, వారి దృష్టి మళ్లించేందుకే మోదీ, వైఎస్‌ జగన్‌ కలిసిపోతున్నారని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే నారాయణ, యనమల, లోకేష్‌లతోపాటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. వక్ఫ్‌ బోర్డు చైర్మన్, ఉర్దూ ఆకాడమీ చైర్మన్‌ ఇవ్వడం పెద్ద గొప్పా...విధిలేని పరిస్థితుల్లోనే ఆ పదవులైనా ఇచ్చారు, వెసులుబాటు ఉంటే అవి కూడా వారి సామాజిక వర్గానికే ఇచ్చేవారన్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల ప్రతి ఏటా 200 మంది ముస్లిం విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్లు వస్తున్నాయని, ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల ఎస్సీ, ఎస్టీలతోపాటే మైనార్టీలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. మేలు చేసిన వారిని, కీడు చేసిన వారిని ముస్లింలు ఎన్నటికీ మర్చిపోరని, మైనార్టీలకు కీడు తలపెట్టిన చంద్రబాబును జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే చంద్రబాబుకే ముస్లింలపై అక్కసు ఎక్కువని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ‘నారా హమారా, చంద్రబాబు దుష్మన్‌ హమారా’అనేది ముస్లింల ఏకైక నినాదమని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్‌ ఛైర్మెన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌ఏ కరిముల్లా, నగర అధ్యక్షుడు షఫీ, మైనార్టీ నాయకులు అబ్దుల్, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

హరికృష్ణ మృతికి వైఎస్‌ అవినాష్‌రెడ్డి సంతాపం
సినీనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి పట్ల కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణది ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement