చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో శుక్రవారం ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది.
పలమనేరు : చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో శుక్రవారం ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పెళ్లి నిశ్చయమైన ఆమెను అదే గ్రామానికి చెందిన ఓ వివాహితుడు మరో ఇద్దరు కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు అప్రమత్తమై కిడ్నాపర్ల నుంచి రక్షించారు. బంగారుపాళెంలోని జెండావీధికి చెందిన చాంద్‌బాషా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్. ఇతనికి పెళ్లై పిల్లలున్నారు. అతని పరిసర ప్రాంతానికే చెందిన అదే సామాజికవర్గానికి చెందిన యువతిని ఇష్టపడ్డాడు. అప్పటికే ఆమెకు మరో యువకునితో నిశ్చితార్థమైంది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది.
తనను ఇష్టపడలేదనే కోపంతో చాంద్‌బాషా అతని అనుచరులు సలీమ్, సన్ను కలసి పక్క వీధిలో వెళ్తున్న ఆ యువతిని అంబులెన్స్‌లోకి బలవంతంగా ఎక్కించుకుని బయలుదేరారు. దీన్ని ఆ ప్రాంతవాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. బంగారుపాళెం పోలీసులు పలమనేరు వైపు వస్తున్న ఆ వాహనాన్ని వెంబడించారు. వెంటనే ఇక్కడి పోలీసులకు సమాచారమివ్వగా అప్రమత్తమయ్యారు. ఆ వాహ నం పలమనేరు దాటి వెళ్తుండగా చెన్నూరు వద్ద పట్టుకున్నారు. చాంద్‌బాషా, సలీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సన్ను అంబులెన్స్‌లో నుంచి దూకి పరారయ్యాడు.