అసలే పేదరికం.. ఆపై పెద్ద జబ్బు.!

Young Suffering With Blood Cancer Waiting For Helping Hands YSR Kadapa - Sakshi

పగబట్టిన బ్లడ్‌ క్యాన్సర్‌

తక్షణం ‘బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ అవసరం

అందుకు రూ. 20 లక్షలు అవసరం

దాతల సాయం కోసం వేడుకోలు

ఇక్కడ కనిపిస్తున్న 23 ఏళ్ల యువకుడి పేరు నందిమండలం సురేష్‌. పేదరికం అడ్డుతగిలినా..ఎదిరించాడు. కష్టపడి చదివాడు. ఎంబీఏ (ఫైనాన్స్‌) అకౌంట్స్‌ చేశాడు. ఈ రంగంలో స్థి్థరపడి పైకెదగాలని కలలు కన్నాడు. ఆ దిశగా అడుగులు వేశాడు. అంతలోనే విధికి కన్నుకుట్టింది. ఇతనికి బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చింది. అకౌంట్స్‌ రంగంలో రాణించాలనుకున్న సురేష్‌ జీవితం ‘లెక్క’ను తారుమారు చేసింది. ఇప్పుడు అతనికి కావలసింది దాతల కరుణ. ఈ యువకుడిపై దయ చూపితే అందరిలా పదికాలాల పాటు జీవిస్తాడు..మనలో ఒకడిలా ఉంటాడు...  

కడప రూరల్‌ : నందిమండలం సురేష్‌ స్వగ్రామం రామాపురం మండలం, కాంపల్లె గ్రామం. కడప నగరం గాంధీనగర్‌ సున్నపురాళ్లపల్లె వీధిలోని ఇంటి నంబరు 1/152లో ఉంటున్నాడు. సురేష్‌ అమ్మ రమాదేవి స్ధానికంగా ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో ఆయాగా పనిచేస్తుంది. నెలకు రూ. 5 వేల జీతం వస్తుంది. నాన్న  నాగాచారి అనారోగ్యంతో 1998లో మరణించారు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం కాగా ఆఖరి కొడుకు సురేష్‌. అందరూ రోజు వారీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.

కాటేసిన క్యాన్సర్‌...
బాగా చదివి ప్రయోజకుడిని కావాలి. నమ్ముకున్న కన్న తల్లికి, సోదరులకు అండగా నిలవాలి. అందరి కష్టాలు తీర్చాలి. ఇవీ సురేష్‌ ముందున్న లక్ష్యాలు. పేదరికం అడ్డు వచ్చినా వెనకడుగు వేయలేదు. కష్టపడి చదివాడు. కడప నగరంలోని ఒక కాలేజీలో ఎంబీఏ (ఫైనాన్‌) అకౌంట్స్‌ చేశాడు. ఏదైనా ఉపాధిని పొంది స్థిరపడుదామని సంకల్పించాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో నోటిలో అల్సర్‌ వచ్చింది. దీనికి స్ధానికి వైద్యుల వద్ద చికిత్స పొందాడు. తరువాత కడుపు నొప్పి వచ్చింది. వైద్యుల వద్దకు వెళ్లాడు. రక్త పరీక్షలు చేస్తే ‘ప్లేట్‌ లెట్స్‌’ తక్కువగా ఉన్నాయని నిర్ధారించారు. చికిత్స కోసం కడప రిమ్స్‌లో ఒక రోజు ఉన్నాడు. అనంతరం వైద్యుల సూచనల మేరకు తిరుపతి రుయాకు వెళ్లాడు. ఈ తరుణంలో వేడి పాలు తాగాడు.

దీంతో నోటిలో అల్సర్‌ సోకిన ప్రాంతంలో ఉండే చర్మం ఊడొచ్చింది. రక్తస్రావం అధికంగా జరిగింది. ఇది గమనించిన రూయా వైద్యులు అక్కడే ఉన్న స్విమ్స్‌కు వెళ్లమని సూచించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్లడ్‌ క్యాన్సర్‌ అని నిర్ధారించారు. ఈ హాస్పిటల్‌లోనే నాలుగున్నర నెలల పాటు ‘కీమో థెరపీ’ చికిత్సను పొందాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో సురేష్‌ మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. మళ్లీ అతను తిరుపతి స్విమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులను సంప్రదించాడు. వారు సురేష్‌ను పరీక్షించారు. రక్తంలో ‘ప్లేట్‌ లెట్స్‌’ తక్కువగా ఉన్నాయని చెప్పడంతో పాటు ‘బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ చేయాలని సూచించారు. అందుకోసం హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌కు వెళ్లగా రూ. 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బులు వారి వద్ద లేకపోవడంతో తిరిగి కడపకు వచ్చారు. దాతలు కరుణించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.  

డిప్యూటీ సీఎం, ఎంపీ సహకారం..  
నా పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషాకు వివరించాను. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 5 లక్షలు అందజేశారు. తరువాత కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డిని కలిశాను. ఆయన ఎస్‌ఓసీ కింద రూ. 5 లక్షలు సహాయం చేశారు. ఈ డబ్బు ‘కీమో థెరపీ’కి సరిపోయింది. ఇప్పుడు కేవలం ‘బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’కు రూ. 20 లక్షలు అవుతుంది. ఈ చికిత్స పొందితే నా ఆరోగ్యం కుదుటపడుతుంది.– నందిమండలం సురేష్, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుడు

నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి  
మాది చాలా పేదరికం. నా బిడ్డలందరూ కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు. నాకు నెలకు రూ. 5 వేలు వస్తుంది. ఈ డబ్బుతో పూట గడవడమే కష్టంగా ఉంది. మమ్మల్ని ఆదుకుంటాడనుకున్న సురేష్‌ క్యాన్సర్‌ బారిన పడడం మమ్మల్ని బాధిస్తోంది. నా కొడుకు పడే అవస్థను చూడలేకున్నాను. దాతలు నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టాలి– రమాదేవి, సురేష్‌ అమ్మ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top