లేని ఇంటికి గృహ ప్రవేశం.. | Young Man Commits Suicide By Hanging In Vijayawada | Sakshi
Sakshi News home page

లేని ఇంటికి గృహ ప్రవేశం..

Sep 9 2018 7:42 AM | Updated on Oct 9 2018 5:43 PM

Young Man Commits Suicide By Hanging In Vijayawada - Sakshi

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ) : సొంత ఇల్లే తన కల అని చెప్పాడు... దాచుకున్న డబ్బులకు తోడు అమ్మ.. అమ్మమ్మ కూడబెట్టిన డబ్బులు తీసుకుని తుళ్లూరులోని టౌన్‌ షిప్‌లో ఇల్లు కడుతున్నానని అం దరితో గొప్పగా చెప్పాడు.. గృహ ప్రవేశం అంటూ బంధువులకు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు అందచేశాడు... కార్యక్రమానికి విచ్చేసిన వారికి అన్ని మర్యాదలు చేశాడు.. హోటల్‌లో రూమ్‌లు, తుళ్లూరుకు వెళ్లి వచ్చేందుకు కార్లు ఏర్పాటు చేశాడు... ముహూర్త సమయం సమీపిస్తుండటంతో ముందు మీరు వెళ్లండి.. అని చెప్పి హోటల్‌ నుంచి ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.

ఈ ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని ఆంజనేయ వాగు సెంటర్‌లో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన పెద్ది నాగమణి, కోటేశ్వరరావు భార్యభర్తలు. వీరికి ఇద్దరు సం తానం. నాగమణి రెండేళ్ల కిందట పెద్ద కుమారుడు పెద్ది రవిని తీసుకుని విజయవాడ కొత్తపేట ఆంజ నేయ సెంటర్‌కు వచ్చేశారు. పెద్ది రవి మహాత్మాగాంధీ రోడ్డులోని బాలాజీ అల్యూమినియం సెంటర్‌లో పని చేస్తుంటాడు.

ఖరగ్‌పూర్‌లోనే భర్త కోటేశ్వరరావు, చిన్న కుమారుడు  తేజేశ్వరరావు కిరాణా వ్యాపారం చేస్తుంటారు. పెద్ది రవి కొంత కాలంగా అమరావతి రాజధాని తుళ్లూరులోని శ్రీ సాయి నికేతన్‌ టౌన్‌ షిప్‌లో ఇంటిని కొనుగోలు చేశానని తల్లి, అమ్మమ్మలను నమ్మించాడు. ఇందుకోసం తల్లి వద్ద నుంచి  లక్షలలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణం పూర్తయిందని చెప్పి శుక్రవారం రాత్రి 1–05 గంటలకు గృహ నిర్మాణం అంటూ ఆహ్వాన పత్రికలు వేయించాడు. శనివారం సత్యనారాయణస్వామి వ్రతం కూడా ఉందని చెప్పాడు. స్నేహితులతో పాటు ఖరగ్‌పూర్‌లోని తండ్రి, సోదరుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. 

తమ్ముడు తేజేశ్వరరావు పది రోజుల కిందట విజయవాడ రాగా, బంధువులు గురువారం ఉదయానికి చేరుకున్నారు. వీరందరికీ ఓ పెద్ద హోటల్‌లో రూమ్‌లు సైతం బుక్‌ చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో తల్లిదండ్రులను, బంధువులను కార్లలో తుళ్లూరుకు బయలుదేరి వెళ్దామని చెప్పాడు. అందరూ సిద్ధమైన తర్వాత మీరు ముందు తుళ్లూరులోని  ఇంటి వద్దకు వెళ్లమని అడ్రస్సు చెప్పాడు. తనకు ఇంట్లో చిన్న పని ఉందని అది చూసుకుని వచ్చేస్తానని నమ్మకంగా చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులందరూ తుళ్లూరు వెళ్లారు. టౌన్‌షిప్‌ గురించి ఆరా తీయగా అసలు అక్కడ ఆ పేరుతో టౌన్‌ షిప్‌ లేదని, ఇది తప్పుడు అడ్రస్‌ అని తెలిసింది.

 అయితే ఆహ్వాన పత్రికలో మాత్రం తుళ్లూరు, కృష్ణా జిల్లా అని ముద్రించడంతో ముందుగానే ప్రణాళిక ప్రకారం ఇది జరిగిందని బంధువులు పేర్కొంటున్నారు. ఇంతలో రవికి ఫోన్‌ చేయగా అవతలి వైపు నుంచి సమాధానం రాకపోవడంతో తిరిగి వాగు సెంటర్‌లోని ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేసరికి తలుపులు గడియ వేసి ఉండటంతో ఉత్తరం వైపు ఉన్న సందులో నుంచి లోపలకు చూడగా వంట గదిలో హుక్‌కు చీరతో ఉరికి వేలాడుతూ పెద్ది రవి కనిపించాడు. దీంతో వెంటనే తలుపులు తెరిచి రవిని ఉరి నుంచి కిందకు దింపగా అప్పటికే ప్రాణాలను కోల్పోయాడు. వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

డబ్బులు ఏం చేసినట్లు..
అయితే పెద్ది రవి చాలా మంచివాడని స్థానికులు చెబుతున్నారు. కొంత కాలంగా అర్ధరాత్రి వరకు ఇంటి ముందు కూర్చుని ఫోన్‌లో మాట్లాడటం, లక్షలాది రూపాయలు ఏం చేశాడనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులతో పాటు తెలిసిన వారి వద్ద కూడా ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడని ప్రచారం జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement