కుక్కకాటుతో కాలేజీ విద్యార్థిని మృతి

young girl dead in govada with dog bite - Sakshi

 గోవాడలో విషాదం

భయాందోళనలో గ్రామస్తులు

చోడవరం:  మగపిల్లలతో సమానంగా ఆటల్లో, చదువులోనూ రాణిస్తున్న కుమార్తెపై  ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.  కుక్కకాటుకు కూతురు మృతిచెందడం ఆ కుటుంబం లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదం అలముకుంది. పంచాయతీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన  శనివారం గోవాడ గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలో గోవాడ గ్రామానికి చెందిన పైడిశెట్టి సన్యాసిరావు, సంధ్య దంపతులకు  ఇద్దరు కుమార్తెలు. వీరిది నిరుపేద కుటుంబం.  పెద్ద కుమార్తె మేఘన (16) చోడవరంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ  మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 6న కాలేజీ ముగిసిన తరువాత గోవాడలో తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడనే ఉన్న వీధి కుక్కలు మీదపడ్డాయి. 

కరిచి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు ఆ కుక్కలను చెదరగొట్టి, చోడవరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి  తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి, ఇంటికి పంపించారు. మధ్యమధ్యలో జ్వరం వస్తుండడంతో అదే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. శనివారం ఉదయం   జ్వరం తీవ్రంగా రావడంతో మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని,  వెంటనే విశాఖపట్నం ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. తల్లిదండ్రులు హుటాహుటిన కారులో విశాఖపట్నం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో నోట్లోంచి నురగలుకక్కుకొని  మేఘన మృతి చెందింది. కళ్లముందే కన్నకూతురు మృతిచెందడంతోఅంతాభోరున విలపించారు. 

నిర్లక్ష్యంగా పంచాయతీ అధికారులు
ఇటీవల అన్ని గ్రామాల్లోనూ కుక్కులు వివరీతంగా పెరిగిపోయాయని జనం గంగగ్గోలు పెట్టగా కొన్ని పంచాయతీల్లో కుక్కలు నిర్మూల చర్యలు చేపట్టారు. కానీ గోవాడ పంచాయతీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు.   రెండు నెలలుగా ఈ గ్రామంలో కుక్కలు మరింత పెరిగిపోయాయి. గంపులుగుంపులుగా వీధుల్లో సంచరిస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మృతిచెందిన బాలిక మేఘనను కుక్క కరిచిన, రెండ్రోజుల్లో ఇదేగ్రామంలో ఆమె పెదనాన్నను కూడా కుక్క కరవడంతో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కూడా పలువురిపై  కుక్కలు దాడి చేశాయి. అయినా   సర్పంచ్, అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు.   మేఘన మృతికి పంచాయతీ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కుక్కలను నిర్మూలించకపోతే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వారు భయాందోళన చెందుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top