నరకదారులు | worst of The situation in rural roads | Sakshi
Sakshi News home page

నరకదారులు

Dec 9 2013 3:56 AM | Updated on Aug 30 2018 3:51 PM

‘రోడ్లకు ఇరువైపుల ఏపుగా దారి మూసుకునిపోయేలా పెరిగిన కంపచెట్లు.. మోకాటిలోతు గుంతలు, కంకర తేలిన రోడ్లు, ప్రమాదకర మలుపులు

సాక్షి, కడప :  ‘రోడ్లకు ఇరువైపుల ఏపుగా దారి మూసుకునిపోయేలా పెరిగిన కంపచెట్లు.. మోకాటిలోతు గుంతలు, కంకర తేలిన రోడ్లు, ప్రమాదకర మలుపులు, మరమ్మత్తులకు నోచుకోని కల్వర్టులు, వర్షం పడితే బురదమయమై ప్రయాణం చేయడానికి వీలుకాని దారులు’...వెరసి జిల్లాలోని గ్రామీణ రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ రోడ్లలో ప్రయాణమంటే ప్రజలు హడలి పోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు.

వర్షం వచ్చినప్పుడు రోడ్లు బురదమయంగా మారి కొన్నిచోట్ల నరక కూపాలుగా తయారవుతున్నాయి. మొత్తం మీద జిల్లాలో పాలకులు, అధికారులు రోడ్ల గురించి పట్టించుకోక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం రోడ్ల నిర్వహణ కూడా  చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. ప్రమాదటపుంచున ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు ద్విచక్ర వాహనాలలో కూడా వెళ్లేందుకు వీలు లేదంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
 కడప నగరానికి కూతవేటు దూరంలోఉండే చింతకొమ్మదిన్నె మండలం రాజులవడ్డెపల్లె, రాజుల తాతయ్యగారిపల్లెతోపాటు బుగ్గవంకకు  వెళ్లే రోడ్డు దుర్భరంగా ఉంది.  గూడావాండ్లపల్లె, బీరంఖాన్‌పల్లె, నాగిరెడ్డిపల్లె, బుగ్గపల్లె, దళితవాడలకు చెందిన గ్రామాల రైతులు ఈ రోడ్డు మీదుగానే పొలాలకు వెళ్లాల్సి ఉంది. 2010లో రోడ్డుకు నామమాత్రంగా మరమ్మత్తులుచేసి వదిలేశారు. రోడ్డుపైన కంకర తేలి ఉండడంతోపాటు కంపచెట్లు ఏపుగా పెరిగి ఉన్నాయి.  కడప నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీల పరిధిలోగల రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి.
  కమలాపురంలో గ్రామ చావిడి నుంచి రైల్వే గేటు వరకు రోడ్డు మోకాటిలోతు గుంతలతో కంకర తేలి  ఉంటుంది. కంకర ఎగిరిపడి పాదచారులకు ఇబ్బందులను పెడుతోంది.  మునకవారిపల్లె, విభవాపురం, వల్లూరు- ఆదినిమ్మాయపల్లె, ఖాజీపేట-కమలాపురం రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
  బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో రిక్షా కాలనీకి వెళ్లే దారే లేదు. అక్కడికి  వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అట్లూరు-తంబళ్లగొందిరోడ్డు, రాచాయిపల్లె ఎస్సీ కాలనీ, కలసపాడు-బ్రాహ్మణపల్లె, తంగెడుపల్లె-బి.కోడూరు రోడ్లు కంకర తేలి తారురోడ్లు సైతం మట్టి రోడ్ల మాదిరి దర్శనమిస్తున్నాయి. దీనికితోడు పోరుమామిళ్ల-బద్వేలు రోడ్డు దుర్భరంగా ఉంది.
  రైల్వేకోడూరు-గంగెద్దుల మిట్టకు ప్రయాణించాలంటే రహదారే లేదు. యేటిలో నడిచి వెళ్లాల్సిందే. దీంతోపాటు రాజీవ్‌నగర్ గిరిజన కాలనీ, పెనగలూరు-దిగువ సిద్దవరం, పల్లంపాడు, పుల్లంపేట మండలంలో కుమారపల్లె వంటి రోడ్లలో ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. వర్షం పడితే పూర్తి బురదమయం అవుతున్నాయి.
  దాదాపు 50 గ్రామాలకు వెళ్లే రాజంపేట-ఆకేపాడు  రహదారి ఘోరంగా ఉంది. మోకాటిలోతు గుంతలతో ఈ రోడ్డుపైన ప్రయాణమంటే ప్రజలు హడలిపోతున్నారు. ఇరిగేషన్‌శాఖ పరిధిలో ఈ రహదారి ఉండడంతో మరమ్మతులకు  నిధులు లేవంటూ చేతులెత్తేశారు. సిద్దవటం మండలం లింగంపల్లె రోడ్డు, నందలూరు మండలం చింతకాయపల్లె రోడ్డుతో పాటు  కొన్నిచోట్ల కల్వర్టులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
  పులివెందుల-వెలమవారిపల్లె తారురోడ్డు కొన్నేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. కంకర తేలి రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. వేముల మండలంలో బచ్చయ్యగారిపల్లె రోడ్డు, గండిరోడ్డు నుంచి బైపాస్‌కు వెళ్లే రహదారి, తొండూరు మండలంలో బూచువారిపల్లె రోడ్డు, సింహాద్రిపురం మండలంలో హిమకుంట్ల, చెర్లోపల్లె, అంకెవానిపల్లెకు వెళ్లే రహదారి చిధ్రమైంది. వర్షాలకు  సెప్టెంబరు, అక్టోబరులో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు నిధులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఆర్‌అండ్‌బీ పరిధిలో 205.3 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, మూడుచోట్ల రోడ్లు కోసుకుపోయాయి. 16 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో * 15 కోట్లతో శాశ్వత అంచనాలు రూపొందించారు. దీంతోపాటు 96 పంచాయతీ రోడ్లు 110.52 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. దీనికోసం 13.36 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. నిధులుమాత్రం మంజూరు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement