వ్యవస్థను మార్చారు

Womens Self Employment In Anantapur - Sakshi

 ఒకప్పుడు జోగినీలు

తర్వాతి కాలంలో     వ్యవసాయ కూలీలు

నేడు జీన్స్‌ ప్యాంట్ల కుట్టుతో గౌరవప్రదమైన జీవనం

బిడ్డలకు ఉన్నత చదువులు

జోగినీ.. బసివినీ.. పేరు ఏదైనా రూపం ఒక్కటే. సమాజంలో తలెత్తుకుని జీవించలేని అసహాయ బతుకులు. ఎక్కడికెళ్లినా అవమానాలు.. ఛీత్కారాలు. ఆఖరుకు పొట్ట కూటి కోసం గౌరవంగా కూలి పనులు చేద్దామన్నా..  దక్కేవి కావు. బిడ్డలకు చదువులు ఆమడదూరం. ఒకవేళ బడిలో చేర్పిస్తే.. అంతులేని వివక్ష.. అవమానాలు! దీంతో బడి ముఖం చూడాలంటే పిల్ల లకు భయం. జిల్లా కర్ణాటక సరిహద్దున ఉన్న మండలాల్లో అనాదిగా వస్తున్న ఈ దురాచారంలో వందలాది మహిళలు మగ్గిపోయారు.  కాలం మారింది. జోగినీల బతుకుల్లో మార్పు వచ్చింది. తమను జోగినీ, బసివినీలుగా మార్చే సంప్రదాయానికి మహిళలు చరమగీతం పాడారు. సమాజంలో గౌరవప్రద జీవనం సాగించేందుకు.. దేవుడి పేరుతో సాగుతూ వచ్చిన ఈ దురాచారాన్ని ఎదిరించారు. 

బొమ్మనహాళ్‌ : కరువు కాటకాలకు నిలయమైన అనంత జిల్లాలోని బొమ్మనహాళ్‌ మండలంలో ఒకప్పుడు జోగినీ వ్యవస్థ బలంగా ఉండేది. దేవుడి పేరుతో మహిళలను జోగినీ, బసివినీలగా మార్చే సంప్రదాయం ఈ ప్రాంతాల్లో అనాదిగా వస్తోంది. దాదాపు 150కి పైగా కుటుంబాలు ఈ వ్యవస్థలో మగ్గిపోతూ వచ్చాయి. వీరిలో కొన్ని కుటుంబాలు వంశపార్యంపరంగా వస్తుండగా, మరికొందరు పొట్టి కూటి కోసం మరో మార్గం లేక ఈ సంప్రదాయాన్ని ఎంచుకుని వచ్చారు.

2009 తర్వాత మార్పు..
జోగినీ వ్యవస్థలో కొనసాగుతున్న మహిళల పట్ల, వారి కుటుంబాల పట్ల సమాజం చిన్న చూపు చూసేది. వారు ఎక్కడికెళ్లినా ఛీత్కారాలు.. అవమానాలు ఎదురయ్యేవి. కనీసం వ్యవసాయ కూలీ పనులు సైతం వారితో చేయించేవారు కాదు. అంతులేని వివక్ష కారణంగా వారి పిల్లలకు సరైన చదువు సంధ్యలు ఉండేవి కావు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఆర్డీటీ సంస్థ తీవ్రంగా కృషి చేసింది. మహిళా సాధికారతతోనే ఈ వ్యవస్థకు చరమగీతం పాడేందుకు వీలవుతుందని భావించిన ఆర్డీటీ సంస్థ ఆ దిశగా 2009లో బొమ్మనహాళ్‌ మండలంలోని ఉంతకల్లులో కుట్టు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పింది.  జీన్స్‌ ప్యాంట్లు, జాకెట్లు, చిన్న పిల్లల డ్రస్సులు కుట్టడంపై ప్రత్యేక శిక్షణను అందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఒక్కొక్కరికి రూ. పది వేలు విలువ చేసే కుట్టు మిషన్లను ఉచితంగా సంస్థ అందజేసింది.

నెలకు రూ.9 వేల వరకు ఆదాయం
తొలిదశలో 27 మంది మహిళలకు జీన్స్‌ ప్యాంట్లు కుట్టడంపై శిక్షణ పొందిన మహిళలు..  20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్లారి నుంచి కత్తిరించిన జీన్స్‌ ప్యాంట్‌ పీస్‌లను తీసుకువచ్చి కుట్టి ఇవ్వడం మొదలు పెట్టారు. పనిలో వారి నిబద్ధతను గమనించిన జీన్స్‌ పరిశ్రమల నిర్వాహకులు తామే నేరుగా కత్తిరించిన ప్యాంట్‌ పీస్‌లను ఇక్కడకు తీసుకువచ్చి ఇచ్చి, సిద్ధం చేయిస్తున్నారు. పీస్‌ వర్క్‌ను బట్టి ధర చెల్లిస్తున్నారు. ప్యాంట్‌ ముందు జేబులను కుడితే ఒక్కొక్క దానికి రూ. 5, మొత్తం ప్యాంట్‌ కుడితే రూ. 24 చొప్పునఅందజేస్తున్నారు. ఇలా రోజూ ఇంటి పట్టునే ఉంటూ రూ. 300 చొప్పున నెలకు రూ. 9 వేల వరకు ఒక్కొ మహిళ ఆర్జిస్తోంది. సంపాదించిన సొమ్ములో కొంత ఇంటి ఖర్చులకు పోను మిగిలినది పిల్లల చదువులకు ఖర్చు పెడుతున్నారు. 

వెలుగులు నింపిన ఆర్డీటీ
అనాదిగా దురాచారానికి బలవుతూ వస్తున్న మహిళల జీవితాల్లో రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ) వెలుగు నింపింది. వ్యవస్థ మార్పునకు శ్రీకారం చుట్టింది. జోగినీలుగా పిలువబడే ఆచారాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలను సంస్థ చేపట్టింది. జోగినీ వ్యవస్థలో మగ్గిపోతున్న వారి జీవనోపాధుల మెరుగుపడేందుకు ఉపాధి పనులు కల్పిస్తూ వచ్చింది. వ్యవసాయ కూలీ పనుల్లో వారిని భాగస్వామ్యులను చేసేలా సమాజంలో చైతన్యం తీసుకువచ్చింది. క్రమేణ వ్యవస్థలో మార్పు వచ్చింది. ఒకప్పుడు కూలీ పనులకు సైతం పిలవని వారు.. తర్వాతి కాలంలో వారితో పనులు చేయించుకోసాగారు. ఇందులో భాగంగానే వారికి మరింత గౌరవప్రదమైన జీవనం అందేలా చేసేందుకు కుట్టులో శిక్షణను ఆర్డీటీ సంస్థ అందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లను ఉచితంగా అందజేసింది. నేడు ప్రతి ఇంటిలో ఆర్డీటీ అందజేసిన కుట్టు మిషన్లు నడుస్తున్నాయి.

ఇంటి వద్దనే ఉపాధి
ఆర్డీటీ అందించిన సహకారంతో కుట్టులో శిక్షణ పొంది ఇంటి వద్దనే ఉపాధి పొందుతున్నాం. జీన్స్‌ ప్యాంట్లతో పాటు మహిళల జాకెట్లు, పంజాబీ డ్రస్సులు కుడుతుంటాను. రోజుకు రూ.350 వరకు ఆదాయం ఉంటోంది. స్వయం ఉపాధితోనే కూతురికి పెళ్లి కూడా చేశాను. కుమారుడిని బళ్లారిలో ఇంటర్‌ చదివిస్తున్నాను.   – శంకరమ్మ, ఉంతకల్లు

ప్రభుత్వం ఆదుకోవాలి
మహిళల జీవనోపాధులను పెంచేందుకు ప్రభుత్వం రాయితీతో రుణాలను ఇవ్వాలి. ఆధునిక హైస్పీడ్‌ కుట్టు మిషన్ల కొనుగోలుకు అవకాశం కల్పించాలి. అలాగే జీన్స్‌ ప్యాంట్ల కుట్టడంపై మరిన్ని మెలకువలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందించాలి.–   శంకరమ్మ, ఉంతకల్లు

జీవితం మారింది
మేము వంశపార్యపరంగా జోగినీ వ్యవస్థకు చెందిన వారం. మా గ్రామంలోనే కాదు.. ఇతర ప్రాంతాలకూ వెళ్లినప్పుడు మమ్మల్ని మనుషులుగా చూసేవారు కాదు. చాలా నీచంగా వ్యవహరించేవారు. కనీసం కూలి పనులకు కూడా పిలిచేవారు కాదు. మా పిల్ల లను బడిలో చేరిస్తే.. వారి పట్ల వివక్ష చూపేవారు. దీంతో పిల్లలు బడికి వెళ్లేవారు కాదు. అయితే ఆర్డీటీ సంస్థ మా కోసం చాలా శ్రమించింది. జీన్స్‌ ప్యాంట్‌లు కుట్టడం నేర్పించి, ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలస పోకుండా చేసింది. ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం వల్ల ఇంటి పట్టునే ఉంటూ జీన్స్‌ ప్యాంట్లు కుట్టి గౌరవప్రదంగా బతుకుతున్నాం. ఇప్పుడు మా జీవితం మారింది. మా పట్ల కాస్త గౌరవంగానే చూస్తున్నారు.   – అంజినమ్మ, ఉంతకల్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top