మస్త్‌గా మట్కా

Matka Gang in Anantapur - Sakshi

నగరంలో రోజూ రూ.కోట్లలో టర్నోవర్‌

పోలీసుల కనుసన్నల్లోనే వ్యవహారం

ఈ చిత్రంలో కనిపిస్తున్నది అనంతపురం పాతూరులోని పూలమార్కెట్‌ సందులో ఉన్న చిన్న కొట్టు. ఇక్కడ రోజూ రూ. లక్షల్లో మట్కా ఆడిస్తున్నారు. ఇందుకు నాయకత్వం వహిస్తున్నదిఓ మహిళ కావడం గమనార్హం. ఇలాంటి కేంద్రాలు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో దాదాపు 20 నడుస్తున్నట్లు తెలిసింది.

అనంతపురం సెంట్రల్‌: నగరంలో మట్కా మూడు క్లోజులు.. ఆరు బ్రాకెట్‌లుగా విరాజిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా మాట్కా పూర్తిగా నిర్మూలించామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా అనంతపురంలో మాత్రం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఆయా పోలీసుస్టేషన్‌ అధికారులకు తెలిసే ఇదంతా నడుస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో అన్ని పోలీసుస్టేషన్‌ల పరిధిలో మట్కా నిర్వాహకులున్నప్పటికీ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మాత్రం ఈ అక్రమ వ్యవహారం రూ. కోట్లలో నడుస్తోంది. పాతూరులో పూలమార్కెట్, తాడిపత్రి బస్టాండ్, గంగాగౌరీ థియేటర్, రాణినగర్, వినాయక్‌నగర్, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో జోరుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా వ్యాప్తంగా మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. కానీ కొన్ని నెలలుగా మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ లాంటి వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆయా పోలీసుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతున్నట్లు తెలిసింది.  

కేసులు లేవు.. రికవరీ కావు
నగరంలోని పోలీసుస్టేషన్లు పూర్తిగా గాడి తప్పుతున్నాయి. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు నుంచి పోలీసుస్టేషన్‌లో  సెటిల్‌మెంట్‌లు మాత్రమే నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై ఎలాంటి దృష్టీ సారించలేదు. ఆరు నెలల కాలంలో నగరంలో మట్కా, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ల కేసులు నమోదు కావడం లేదు. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఈ అక్రమ దందా వ్యవహారం యథేచ్ఛగా జరుగుతున్నా నిందితులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు పక్షపాతధోరణి వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లు అందుతుండడం వలనే వారు ఇలా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు కానిస్టేబుళ్లు మట్కా నిర్వాహకులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వన్‌టౌన్‌ ఎస్‌ఐగా హమీద్‌ఖాన్‌ మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపారు. మూడునెలల కాలంలో దాదాపు 30 మందిని అరెస్ట్‌ చేసి రూ. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బదిలీ అనంతరం రూ.లక్ష కూడా పట్టుకున్న పాపాన పోలేదు.

చర్యలు తీసుకుంటాం
నగరంలో మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలి. పోలీసు సిబ్బందిపై ఆరోపణలు వస్తే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.  – పీఎన్‌ బాబు, డీఎస్పీ, అనంతపురం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top