
సాక్షి, విశాఖపట్నం: అన్ని రంగాల్లో అతివలు ముందంజ వేస్తున్న కాలమిది. చట్టసభలకు ఎవరు వేళ్లేదీ నిర్ణయించే విషయానికి కూడా ఇది వర్తిస్తుంది. మిగిలిన ప్రాంతాల సంగతి అటుంచితే.. విశాఖ జిల్లాలో మాత్రం ఇది అక్షరసత్యమవుతోంది. జిల్లాలోని 15 నియోజకవర్గాలలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంగతే అధికంగా ఉంది. అయిదేళ్ల కిందటి పద్ధతిని కొనసాగించే విధంగా ఈసారి కూడా మగువలదే పైచేయిగాఉంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 35,78,458 మంది ఓటర్లున్నారు. వారిలో 17,75,630 మంది పురుషులు కాగా, 18,02,631 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ లెక్కన చూస్తే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు జిల్లాలో 27,001 మంది అధికంగా ఉన్నారు. ఇక గత ఎన్నికలతో పోల్చినా వీరి సంఖ్య అధికంగానే కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లలో 16,70,307 మంది పురుషులుండగా, 16,76,105 మంది మహిళలున్నారు.
2014లోని సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాదికి మహిళా ఓటర్లు 1,26,526 మంది, పురుష ఓటర్లు 1,05,323 మంది పెరిగారు.కాగా గతఎన్నికల సమయానికి 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా, ఈసారి అదనంగా మరో నియోజకవర్గంలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్టుగా లెక్క తేలింది. కేవలం నాలుగు నియోజకవర్గాల పరిధిలోనే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు కాస్త అధికంగా ఉన్నారు. దీంతోఈసారి కూడా మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా పేర్కొనక తప్పదు. బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలు తలకిందులు చేసే సత్తా మళ్లీ వీరికే ఉందని స్పష్టమవుతోంది.పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కంటే అత్యధికంగా విశాఖ పశ్చిమలో ఉన్నారు. అదే విధంగా మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే పాడేరులో అత్యధికంగా ఉన్నారు. మహిళల కంటే పురుష ఓటర్లు అధికంగా నియోజకవర్గాలను పరిశీలిస్తే పెందుర్తి (799 మంది), విశాఖ పశ్చిమ(7328 మంది), విశాఖ దక్షిణం (187 మంది), గాజువాక (5773 మంది) తేలాయి. ఇక పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు భీమిలి (1671 మంది), విశాఖ తూర్పు (2865 మంది) విశాఖ ఉత్తరం (566 మంది), యలమంచలి (3585 మంది), పాయకరావుపేట (2389 మంది), అనకాపల్లి (4956 మంది), నర్సీపట్నం (5410 మంది), చోడవరం(5312 మంది), పాడేరు (6088 మంది), మాడుగుల (3632 మంది) అరకు (4604 మంది)లలో అధికంగా ఉన్నారు.
ఓటుహక్కు వినియోగంలోనూ వారే
2014 ఎన్నికల పోలింగ్ సరళిని గమనిస్తే 15 నియోజకవర్గాల్లో 24,08,696 మంది (71.97) తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలే అధికం. నాటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 12,02,726 మంది కాగా, మహిళా ఓటర్లు 12,05,969 మంది. మొత్తం మహిళా ఓటర్లలో 71.95 శాతం మంది మహిళలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మహిళలను అత్యధిక సంఖ్యలో చట్టసభలకు పంపాలన్న లక్ష్యం మేరకు ఈసారి వైఎస్సార్‌సీపీ మహిళలకు పెద్దపీట వేసిన సంగతి విదితమే. దీంతో గతంతో పోలిస్తే ఈసారి బరిలో నిలిచిన వారిలో మహిళా అభ్యర్థులు అధికంగానే ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున అనకాపల్లి, అరకు లోక్‌సభ స్థానాల నుంచి డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, అలాగే పాడేరు, విశాఖ తూర్పు నియోజకవర్గాల నుంచి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అక్కరమాని విజయనిర్మల బరిలో నిలిచారు. మహిళా అభ్యర్థులు అత్యధికంగా బరిలోకి దిగడంతో వారిని ఎలాగైనా చట్టసభలకు పంపాలన్న పట్టుదల మహిళల్లో కన్పిస్తోంది.
అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నూరు శాతం మహిళలు ఓట్లు వేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ మహిళల కోసం ప్రకటించిన వైఎస్సార్ చేయూత (నాలుగు విడతల్లో ఉచితంగా రూ.75 వేలు పంపిణీ), డ్వాక్రా రుణమాఫీ (ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉందో ఆ మొత్తం నాలుగు విడతల్లో జమ చేయడం) వంటి హామీలు కూడా మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అంతా అనుకున్నట్టే జరిగితే చాలా మంది అభ్యర్థుల తలరాతలు మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం మొత్తం ఓటర్లు
35,78,458