స్పందించిన సీఎం వైఎస్ జగన్‌

Women Show Placard To CM YS Jagan Mohan Reddy In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: తనకు న్యాయం చేయాలంటూ రాజ్‌ భవన్‌ వద్ద ఫ్లకార్డుతో ఓ మహిళ నిలబడటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం జగన్‌ సోమవారం రాజ్‌భవన్‌ వచ్చిన సందర్భంగా.... పద్మావతి అనే మహిళ తన సోదరి కుమారుడిని హత్యచేసిన వారిని శిక్షించాలంటూ ‘సీఎం గారు న్యాయం చేయండి’ అనే ప్లకార్డు ప్రదర్శించింది. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు.

ఈ సందర్భంగా విజయవాడకు చెందిన పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 21న తన చెల్లెలి కుమారుడు మనోజ్ హత్యకు గురయ్యాడని తెలిపారు. స్నేహితులే మనోజ్‌ని చంపేశారని అనుమానం వ్యక్తం చేశారు. గొంతుకోసి తలకాయపై మోది హత్య చేసినట్టు తెలుస్తోందన్నారు. కిరాయి మనుషులని కేసులో పెట్టి.. అసలు నిందితులను పోలీసులు వదిలేశారని అన్నారు. హత్య చేసిన వారి బంధువు ఎస్ఐ కావటంతో పోలీసు డిపార్ట్‌మెంట్‌ సాయం వల్ల కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు.

రాచకొండ సాయి కృష్ణతో పాటు అతని తల్లి కనకదుర్గ మరో ఇద్దరు మనోజ్‌ని హత్య చేశారని పద్మావతి తెలిపారు. కుటుంబ సభ్యులుగా తమ నుంచి పోలీసులు ఎటువంటి వివరాలు తీసుకోలేదన్నారు. హత్య చేసిన వారి గురించి సమాచారం ఇచ్చినా స్పందించలేదని చెప్పారు. అసలు నిందితులపై కేసు నమోదు చేయమంటే స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో ‘సీఎం గారు న్యాయం చేయండి’ అనే ప్లకార్డు చూపించాని పద్మావతి తెలిపారు. కాగా, దూరంలో ఉన్నా తనను సీఎం వైఎస్‌ జగన్‌ గమనించి స్పందించటం తనకు ఆనందంగా ఉందన్నారు. సీఎం దృష్టికి విషయం వెళ్లటంతో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని హతుని పెద్దమ్మ పద్మావతి తెలిపారు.

స్పందించిన విజయవాడ డీసీపీ విక్రాంత్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆదేశాల మేరకు విజవాడ డీసీపీ విక్రాంత్‌ స్పందించి.. సెప్టెంబర్‌ 21న అరండల్‌పేటలో మనోజ్‌ అనే యువకుడి హత్య జరిగిందన్నారు. కాగా ఈ హత్యకేసుపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. కేసు నమోదు చేసి ఇద్దరిపై కేసు కూడా పెట్టామని ఆయన వెల్లడించారు. ఈ రోజు హతుడు మనోజ్‌ పెద్దమ్మ పద్మావతి సీఎం జగన్‌ కాన్వాయ్‌ ముందు న్యాయం కావాలని ప్లకార్డు ప్రదర్శించారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కేసుపై విచారణ జరపాలని ఆదేశించారు. సీఎం జగన్‌ ఆదేశాలకు వెంటనే స్పందించిన డీపీపీ.. మనోజ్‌ కేసులో కుటుంబసభ్యుల అనుమానాలపై కూడా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. కుటంబ సభ్యులకు ఎవరి మీద అయినా అనుమానం ఉంటే సాక్ష్యాధారాలతో తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మనోజ్‌ హత్యకేసులో నిందితులను తప్చించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ పాత్రపై కూడా విచారణ జరిపిస్తామని డీసీపీ విక్రాంత్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top