మృత్యు యంత్రం

Woman Worker Died in Mition Accident - Sakshi

వరి నూర్పిడి మిషన్‌లో చిక్కుకుని మహిళా కూలీ దుర్మరణం

మృతురాలు సాక్షరభారత్‌ వీసీ

పనసపాటలో విషాదఛాయలు

శ్రీకాకుళం, రాజాం/సంతకవిటి: వరి నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకుని మహిళా కూలీ దుర్మరణం చెందిన ఘటన సంతకవిటి మండలం పనసపేట వద్ద బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్తివలస గ్రామానికి చెందిన రాజాపు ఈశ్వరమ్మ(30) తోటి మహిళలతో కలిసి వ్యవసాయ నూర్పిడి పనుల నిమిత్తం పనసపేట వెళ్లింది. అక్కడ వరిపంటను నూర్పిడిచేస్తున్న సమయంలో ఇంజిన్‌ ఫ్యాన్‌లో చీర చిక్కుకోవడంతో ప్రమాదానికి గురైంది. బలమైన గాయాలయ్యాయి. వెంటనే తోటి కూలీలు స్పందించి రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఈమె మృతదేహాన్ని స్వగ్రామం మిర్తివలసకు తీసుకొ  చ్చిన అనంతరం సంతకవిటి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజాం రూరల్‌ సీఐ రుద్రశేఖర్, సంతకవిటి హెచ్‌సీ ప్రసాదరావులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. 

సాక్షరభారత్‌ ఎత్తివేయడంతో..
ఈశ్వరమ్మ గతంలో మిర్తివలస సాక్షరభారత్‌ విలేజ్‌ కోఆర్డినేటర్‌గా పనిచేసేవారు. భర్త రమణారావు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఏడాది కాలంగా సాక్షరాభారత్‌ పథకం నిలిపివేయడంతో గౌరవ వేతనాలు రాక కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం కూలి పనులకని పనసపేట వెళ్లి మృత్యుఒడిలోకి చేరిపోయింది.

బోరున విలపించినచిన్నారులు..
ప్రమాదంలో మృతిచెందిన ఈశ్వరమ్మకు ఏడేళ్ల కుమారుడు సాయి(2వ తరగతి), ఐదేళ్ల కుమారుడు ప్రదీప్‌(1వ తరగతి) ఉన్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన వీరు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి వద్ద జనాలు ఉండడాన్ని చూసి బిత్తరపోయారు. జనం మధ్యలో తల్లి అచేతనంగా పడి ఉండడం, తండ్రి రమణారావు బోరున విలపించడాన్ని చూసి వీరు కూడా కన్నీరుమున్నీరుగా విలపించారు. అమ్మా లే..అంటూ తల్లి మృతదేహంపై పడి ఏడ్చిన తీరు గ్రామస్తులను కంట తడిపెట్టించింది. అందరికీ చేదోడువాడోదుగా ఉంటూ జీవనం సాగించిన ఈశ్వరమ్మ మృతిని గ్రామస్తులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top