రూ.15 వేల అప్పుకు ఇల్లు ఆక్రమించారు

Woman Complaint in national SC Commission - Sakshi

జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడికి ఫిర్యాదు

గుంటూరు ,అనంతవరం(తుళ్లూరురూరల్‌) : స్థలం తాకట్టు పెట్టి ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నామని... తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉందంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని అనంతవరం గ్రామానికి చెందిన మేకల బసవమ్మ జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు వద్ద తన గోడు విన్నవించింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులదూషణ కేసుపై విచారించేందుకు రాములు శుక్రవారం అనంతరం వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బాధితులు తమ సమస్యలను ఆయనకు  ఏకరువు పెట్టారు. తన భర్తకు అనారోగ్యం కారణంగా అదే గ్రామానికి చెందిన పోలు రమేష్‌ అనే వ్యక్తి నుంచి స్థలం తాకట్టు పెట్టి రూ.15,000  అప్పు తీసుకున్నామని మేకల బసవమ్మ చెప్పింది. కొంత కాలం తరువాత తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి వెళితే తొలుత వడ్డీ మాత్రమే రూ.20,000 చెప్పాడంది.

అనంతరం అసలు స్థలం మీది కాదంటూ ఇంటి నుంచి తమను బయటకు పంపించారని వాపోయింది. తన ఇంటిని రమేష్‌ అనుచరులతో కలిసి పడగొట్టారని పేర్కొంది. ఈ ఘటనపై తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన రాములు పోలు రమేష్, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తుళ్లూరు డీఎస్పీకి  ఆదేశాలు  జారీ చేశారు. రిపోర్టును ఎస్సీ కమిషన్‌ క్యాలయానికి  పంపించాలని సూచించారు.  కులాంతర వివాహం చేసుకున్న తమకు బంధువుల నుంచి రక్షణ కల్పించాలని  పెదకూరపాడుకు చెందిన ఓ ప్రేమ జంట రాములును కోరింది. అనూష, శ్రీను అనే దంపతులు తమకు తమ తల్లిదండ్రులు, బంధువుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. తమ సమస్యను చెప్పుకునే సమయంలో యువతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి పటిష్ట భద్రత కల్పించాలని, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కమిషన్‌ సభ్యులు రాములు అడిషనల్‌ ఎస్పీకి సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top