ఏడేళ్ల కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య | Woman commits suicide with 7 years old son | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య

Dec 11 2017 11:00 AM | Updated on Dec 12 2017 4:14 AM

 Woman commits suicide with 7 years old son - Sakshi

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

ఒంగోలు క్రైం: ఏడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకెళ్లిన ఓ తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం వేకువజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన శ్యామల(30)కు ఒంగోలు సంతపేటకు చెందిన బొమ్మిరెడ్డి సుధాకరరెడ్డి అలియాస్‌ గాంధీతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు పార్దీవ్‌ ఉన్నాడు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సుధాకర్‌రెడ్డి తనకు మొక్కుబడి ఉందని నాలుగు రోజుల కిందట అయ్యప్ప మాలధారులతో కలిసి శబరిమలకు వెళ్లాడు.

సోమవారం వేకువజామున 3 గంటల సమయంలో శ్యామల నిద్రమత్తులో ఉన్న పార్దీవ్‌ను తీసుకుని సమీపంలోని అగ్రహారం రైల్వే గేటు వద్దకు వెళ్లింది. కొద్దిసేపు అక్కడే నిలబడిన శ్యామల సింగరాయకొండ నుంచి ఒంగోలు వైపు వస్తున్న రైలును గమనించి ఒక్క ఉదుటున పట్టాల మీదకు పరుగు తీసి రైలు కింద పడి కుమారుడితో సహా తునాతునకలైంది. సమాచారం తెలుసుకున్న ఒంగోలు రైల్వే జీఆర్‌పీ పోలీసులు మాంసపు ముద్దలుగా ఉన్న మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ ఎస్సై రహీంరెడ్డి తెలిపారు.

సోదరిదీ ఆత్మహత్యే: వాస్తవానికి సుధాకరరెడ్డి శ్యామలను రెండో వివాహం చేసుకున్నాడు. శ్యామల అక్కతో మొదటి వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో సుధాకర్‌రెడ్డి మరదలైన శ్యామలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమె కూడా బలవన్మరణం చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement