‘హస్తిన’.. ఎవరి హస్తగతమవునో..!

Who Will Be The King In Delhi Loksabha Elections 2019 - Sakshi

మోదీ మంత్రం ఫలించేనా..!

ఆప్‌ జోరు చూపేనా..?

కాంగ్రెస్‌ను రాహుల్‌ గట్టెక్కించేనా?

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందోననే అంశం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిరసనలు, ఉద్యమాలకు నెలవు, భారత రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే రాజధాని నగరంలో గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డడానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీ మళ్లీ అదే ఫీట్‌ను నమోదు చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన ఆప్‌ ఎంపీ సీట్లనూ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన హస్తం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని పొందే దిశగా వ్యూహాలు పన్నుతోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న త్రిముఖ పోరులో గెలిచి మురిసేదెవరో..!

రాజకీయ చరిత్ర

ఢిల్లీ 1990 వరకూ హస్తం పార్టీకి కంచుకోటగా ఉండేది. 90ల తరువాత రాజధానిలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1991లో కాషాయ పార్టీకి హస్తిన ప్రజలు పట్టం కట్టారు. తదనంతర కాలంలో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిపత్యం మారుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి ఢిల్లీ కోటలో పాగా వేసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ షీలా దీక్షిత్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చి ఘనవిజయం సాధించింది.

దూసుకొచ్చిన బీజేపీ

కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉన్న ఢిల్లీలో 1991 పార్లమెంట్‌ ఎన్నికల్లో లాల్‌ కృష్ణ అద్వానీ సారథ్యంలోని బీజేపీ విజయ దుందుభి మోగించింది. 40.2శాతం ఓట్లతో బీజేపీ 5సీట్లు గెలుచుకోగా, 39.6శాతం ఓట్లతో కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది.

మళ్లీ వికసించిన కమలం

బీజేపీ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తన పట్టును నిలుపుకుంది. ఈసారి 49.6శాతం ఓట్లతో మళ్లీ 5సీట్లను గెలుచుకొని, కాంగ్రెస్‌ను ద్వితీయ స్థానానికి నెట్టింది. 37.3శాతం ఓట్లను హస్తం పార్టీ గెలుచుకోగలిగింది. 1998లో జరిగిన ఎలక్షన్లలో వాజ్‌పేయి హయాంలోని కమల దళం 50.7శాతం ఓట్లతో 6సీట్లలో విజయ బావుటా ఎగురవేసింది. 42.6శాతం ఓట్లతో కాంగ్రెస్‌ కేవలం ఒక సీటుకే పరిమితమైంది.

కమలం క్లీన్‌స్వీప్‌

1991 నుంచి చిక్కిన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాషాయ పార్టీ 1999 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తూ 51.7శాతం ఓట్లతో 7సీట్లను గెలుచుకుంది.

కాంగ్రెస్‌ రెపరెపలు

దాదాపు దశాబ్దం కాలంపాటు సాగిన బీజేపీ ఆధిపత్యానికి చెక్‌పెడుతూ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 2004లో 54.8శాతం ఓట్లను సాధించి 6సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ అన్ని సీట్లనూ(7) తన వశం చేసుకుంది.

బీజేపీ గెలుపు ఢంకా 

2014 సార్వత్రిక ఎన్నికల్లో 3జీ స్కాం, కుంభకోణాలు, పలు అవినీతి ఆరోపణలతో దేశమం‍తా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచింది. ఎగ్జిట్‌పోల్స్‌ ముందే చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్‌ షా ఆధ్వర్యంలోని బీజేపీ 46.6శాతం ఓట్లతో 7సీట్లలో గెలుపు నగారా మోగించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top