నెరవేరని రాజన్న ఆశయం

West Godavari: Issues Of Mogalthooru Drinking Water Project - Sakshi

నిరుపయోగంగా భారీ మంచినీటి పథకం

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

సాక్షి, మొగల్తూరు (పశ్చిమ గోదావరి): నాలుగు గ్రామాల ప్రజలకు తాగు నీరందిస్తానని దివంగత నేత తీర ప్రాంత ప్రజల గుండెలోల చిరస్థాయిగా నిలిచిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. రాజీవ్‌ పల్లెబాటలో భాగంగా 2009 జనవరిలో మండలంలో పర్యటించిన సందర్భంలో రూ.33 కోట్లతో  మొగల్తూరులో భారీ మంచి నీటి ప్రాజెక్టుకు దివంగత నేత హామీ ఇచ్చారు. ఆయన అకాల మృతి అనంతరం ప్రభుత్వాలు మారినా పట్టించుకున్న నాదుడు లేడు.

రూ.13 కోట్లతో చేపట్టిన పనులు
రూ.13 కోట్లు వెచ్చించి సుమారు 30వేల మంది ప్రజల దాహర్తి తీర్చేందుకు ఉద్దేశించి  మొగల్తూరు గొల్లగూడెంలో తవ్విన చెరువు. పంచాయతీకి చెందిన చెరువునే ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించి చెరువు చుట్టూ రివిట్‌ మెంట్‌ కట్టారు. అయితే నాలుగు గ్రామాలకు తాగు నీరందించాల్సి ఉండగా కేవలం మొగల్తూరుకు తప్ప ఏ గ్రామానికి అందదు.

నాలుగు గ్రామాలకు తాగునీరు
మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం, కొత్తపాలెం గ్రామాలతో పాటు సుమారు 40 శివారు ప్రాంతాలకు తాగు నీరందించేందుకు రూ. 13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రాజెక్టును సుమారు 20 ఎకరాల్లో నిర్మించేందుకు  భూసేకరణకు ప్రయత్నించినా పనులు పూర్తి కాలేదు. అయితే నిధులు మురుగుపోతున్నాయనే ఉద్దేశంతో మొగల్తూరు పంచాయతీ ప్రాజెక్టు చెరువుతోపాటు పంచాయతీకి చెందిన మరో రెండు చెరువులు కలుపుకుని తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. దీనిలో భాగంగా మొగల్తూరులోని పాలకమ్మ చెరువు రోడ్డులో గల కోమటి చెరువులో నీటిని నిల్వ చేసి గొల్లగూడెం చెరువు ద్వారా ఓవర్‌ హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పైప్‌లు ద్వారా నీరందించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

పూర్తి కాని పైప్‌లైన్‌ పనులు
ఇక ఫిల్టర్‌  అయిన నీటిని ఓవర్‌ హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో రిజర్వు చేసుకుని పైప్‌లు ద్వారా గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న రామన్నపాలెంలో 8, మొగల్తూరులో 7, శేరేపాలెంలో 3, కొత్తపాలెంలో 2 ఓహెచ్‌ఆర్‌లు ద్వారా అందించాల్సిన పైప్‌లైన్‌ పనులు పూర్తికాలేదు. శేరేపాలెంలో పైప్‌లైన్‌ పనులు పూర్తిఅయినా నీరందటంలేదు. కొత్తపాలెం గ్రామంలో మాత్రం కొద్దిగా వస్తున్నాయని, నాసిరకం పైపులు కారణంగా నీరందడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రామన్నపాలెం గ్రామంలో కొంతమేర పైప్‌లైన్లు వేసి వదిలేయడంతో ఆగ్రామానికి పూర్తిగా నీరు సరఫరా కావడంలేదు. కేవలం మొగల్తూరు గ్రామానికి మాత్రమే పూర్తి స్థాయిలో నీరందిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే తాగునీటి ప్రాజెక్టుపై పాలకులు శ్రద్ధ చూపడం లేదని ఈ సారి సమస్యలను తీర్చే నాయకుడునే ఎన్నుకుంటామని ప్రజలు చెబుతున్నారు.

తాగు నీరందడం లేదు
మొగల్తూరు ప్రాజెక్టు ద్వారా తాగు నీరందడంలేదు. గ్రామంలోని పంచాయతీ చెరువు ఉన్నా  తాగేందుకు పనికి రావడంలేదు. దీంతో రోజూ కొనుక్కుని తమ దాహాన్ని తీర్చుకుంటున్నాం.
– ఏగి రాజశేఖర్, శేరేపాలెం

నాసిరకంగా పనులు
ప్రాజెక్టు పనులు నాసిరకంగా చేపట్టడంతో చిన్న దెబ్బతగిలినా పైపులు పగిలి పోతున్నాయి. కాంట్రాక్టరు అధికారం పక్షానికి దగ్గిర వ్యక్తి కావడంతో పనులు నాసిరకంగా పూర్తిచేసినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు.
– కొత్తపల్లి ఆంజనేయులు, కొత్తపాలెం

ఇప్పటికీ మాకు నీరందదు
మొగల్తూరు భారీ ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి కూడా నీరందిస్తామని దివంగత నేత ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఇప్పటికీ మాగ్రామానికి పైప్‌ లైన్‌ పనులు పూర్తి చేయలేదు. జగన్‌  అధికారంలోకి వస్తేనే మాకు నీరు అందుతుంది. 
–  కాటూరి చంద్రమోహన్, రామన్నపాలెం

జగన్‌ రావాలి – తాగు నీరందాలి
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జలయజ్ఞం పథకంలో మంచి నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. మా గ్రామానికి స్వచ్ఛమైన నీరందాలంటే జగన్‌ రావాలి, తాగు నీరందాలి.
– కొత్తపల్లి బాబి, శేరేపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top