కాలానికి అనుగుణంగా పంట లు వేస్తేనే మంచి ఫలితాలొస్తాయనేది వ్యవసాయరంగ నిపుణులతోపాటు సాధారణ రైతులు సైతం చెప్పేమాట.
సాక్షి, ఏలూరు :
కాలానికి అనుగుణంగా పంట లు వేస్తేనే మంచి ఫలితాలొస్తాయనేది వ్యవసాయరంగ నిపుణులతోపాటు సాధారణ రైతులు సైతం చెప్పేమాట. కానీ.. కొన్నేళ్లుగా జిల్లాలో అదునులో పంటలు వేయలేని దుస్థితి దాపురిస్తోంది. సార్వా మాసూళ్లు డిసెంబర్ నెలాఖరుకు గాని పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నాట్లు కూడా ఈ నెలాఖరు నాటికి మొదలుకానున్నాయి. ఈ ఏడాది దాళ్వాలో 4లక్షల 60 వేల ఎకరాల్లో వరి పండించడానికి రైతులు నారుమళ్లు వేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 22,500 ఎకరాల్లో నారుమడులు పోయూల్సి ఉంది. ఇప్పటివరకూ 15వేల ఎకరాల్లో మాత్రమే నారుమళ్లు వేశారు.
సాధారణంగా దాళ్వా నారుమళ్లను డిసెంబర్ 20లోపు పూర్తి చేసి, జనవరి 15 లేదా 20 లోపు నాట్లు పూర్తిచేయాలని వ్యవసాయాధికారులు చెబుతుంటారు. ఈ ఏడాది జనవరి చివరి నాటికైనా కనీసం సగం ఆయకట్టులో కూడా వరి నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. డిసెంబర్ నెలాఖరు నాటికి అక్కడక్కడా నాట్లు వేసే అవకాశం కనిపిస్తున్నా.. ఫిబ్రవరిలో కూడా నాట్లు కొనసాగుతాయి. నాట్లు ఆలస్యం కావడం వల్ల పంట మే నెల వరకూ ఉంటుంది. అప్పటివరకూ చేలకు నీరు అవసరం. కానీ.. ఏప్రిల్ రెండో వారంలోనే కాలువలు కట్టేస్తారు. ఆ తర్వాత డెల్టాకు సాగునీరు అందదు. మెట్టలో బోరు నీరే ఆధారం. వేసవిలో విద్యుత్ కోతల వల్ల అక్కడా సాగునీటి ఇబ్బందులు తప్పవు. ఆ సమయానికి వరి పొట్టపోసుకునే దశలోనో, ఈనే దశలోనో ఉంటుంది.
ఈ దశలో నీరు పూర్తిగా అందకపోతే గింజలు తప్పలుగా మారిపోతాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సార్వా మాసూళ్లను వేగంగా ముగించి దాళ్వాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అన్నదాతలు అనుకున్నారు. అరుునప్పటికీ ఈ ఏడాది కూడా దాళ్వా అలస్యం కానుంది. అంతే గాక సార్వా పంటకు సంబంధించి చేలల్లో మిగిలిపోరుున మోళ్లు కుళ్లడానికి కొంత సమయం పడుతుంది. గతేడాది అంత సమయం దొరక్కపోవడంతో భూమి సారాన్ని కోల్పోయింది. పంట తెగుళ్ల బారిన పడింది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది.