అక్రమ కేసులకు భయపడం | we dont afraid of illegal cases | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడం

Jun 21 2015 2:31 AM | Updated on Aug 10 2018 8:13 PM

అక్రమ కేసులకు భయపడం - Sakshi

అక్రమ కేసులకు భయపడం

ప్రతిపక్ష పార్టీగా అధికార టీడీపీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడతామని.. ఈ విషయంలో అక్రమ కేసులు బనాయించినా

డోన్ : ప్రతిపక్ష పార్టీగా అధికార టీడీపీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడతామని.. ఈ విషయంలో అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున బరిలో నిలిచిన డి.వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి.. నంద్యాల, కర్నూలు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. బుగ్గన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు.

అధికార పార్టీ ఆదేశాలతో రెండు జీపుల్లో వచ్చిన పోలీసులు నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే కానీ అధికార పార్టీకి కొమ్ము కాయం తగదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు రుణాలు అందడం లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.56వేల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ పంపిణీ రూ.16వేల కోట్లు మించలేదన్నారు. రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులతో పాటు డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపుతున్నారన్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నందుకే తరతరాలుగా తమ కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం ఒక సంవత్సరం 10 నెలలు మాత్రమే ఉందని, ఈ పదవినీ దక్కించుకునేందుకు బలం లేకపోయినా అధికార టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. దొంగ పని చేసిన చంద్రబాబు సమర్థించుకుంటున్న తీరు చూస్తే.. భవిష్యత్తులో చిల్లర దొంగలు కూడా కోర్టులను తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పాలనను భ్రష్టు పట్టించి అవినీతి మార్గాలను అన్వేషించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. కేసు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారన్నారు.

పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కన్న తల్లి లాంటి పార్టీని కళ్లలో పెట్టుకుని చూసుకున్నప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజాసంక్షేమానికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలిప్‌చక్రవర్తి, పద్మావతమ్మ, బేతంచెర్ల ఎంపీపీ కిష్టమ్మ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ దివంగత నేత ఆర్‌ఈ రవికుమార్ సతీమణి ఆర్‌ఈ సరళమ్మ, కుమారుడు రాజవర్దన్‌లను నాయకులు పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement