9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

Godavari Water Flow Increase In Davaleswaram Barrage In West Godavari - Sakshi

ఉధృతంగా వరద

29 గ్రామాలకు రాకపోకలు బంద్‌ 

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోకీ నీరు 

సాక్షి, పోలవరం(పశ్చిమగోదావరి) : ధవళేశ్వరం గోదావరి నీటిమట్టం 9 అడుగులకు చేరింది. బుధవారం సుమారు ఏడు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి ఇరిగేషన్‌ అధికారులు విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య పోలవరం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో గిరిజన నిర్వాసిత గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఫలితంగా  నిర్వాసిత గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం జలమయమైంది. దీంతో పోలవరం కుక్కునూరు మండలాల్లోని 29 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీటికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో  ఆ గ్రామాల ప్రజలు కొండపైకి ఎక్కి తాత్కాలికంగా గుడారాలు వేసుకుంటున్నారు. ఇంట్లోని సామగ్రి, పశువులను వెంట పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నించినా.. 
వరదలు  వస్తే పోలవరం మండలంలోని 19 గ్రామాల నిర్వాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం ముందుగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  ఒక్కసారిగా వరదలు పెరగడంతో రోడ్డు మార్గాల్లోకి వరదనీరు చేరింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నిర్వాసితులను అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రం పోలవరం చేర్చేందుకు టూరిజం బోట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోట్ల సింగన్నపల్లి రేవు నుంచి గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా పోలవరం, కుక్కునూరు మండలాల్లో 22 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారులు నీటమునిగాయి. పోలవరం ప్రాజెక్టు ప్రాంతమూ ముంపునకు గురైంది. వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు ప్రాంతం నుంచి సింగన్నపల్లి వెళ్లే రోడ్డు మార్గం కూడా వరదనీటిలో మునిగిపోయింది.

ముందస్తుగా అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్వాసితులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. నిర్వాసితుల కోసం పోలవరం, గూటాల, పట్టిసీమ, చేగొండిపల్లి ప్రాంతాల్లో షెల్టర్లను గుర్తించారు. వరదలు పూర్తిగా తగ్గి, రోడ్డు మార్గాలు బయటపడితే తప్ప నిర్వాసిత గ్రామాల ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. గోదావరి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు స్పిల్‌వేలోని రివర్స్‌ స్లూయిజ్‌ ద్వారా నీరు దిగువకు చేరుతోంది. గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రయత్నించిన మార్గాల్లో పనులు చేపట్టి నీరు వెళ్లే విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. 8 రివర్స్‌ స్లూయిజ్‌ల నుంచి నీరు స్పిల్‌వేలోకి చేరుతోంది. స్పిల్‌ ఛానల్‌ మీదుగా గోదావరిలోకి నీరు చేరేందుకు ఏర్పాటు చేశారు.

కాఫర్‌ డ్యామ్‌ వద్ద 27.20 మీటర్ల నీటిమట్టం 
పోలవరం  కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటి మట్టం 27.20మీటర్లకు చేరింది. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటితే స్పిల్‌వే రివర్స్‌ స్లూయిజ్‌ నుంచి స్పిల్‌ ఛానల్‌ ద్వారా నీరు విడుదల చేయాలని సీడబ్ల్యూసీ అధికారులు సూచించినట్లు ప్రాజెక్టు ఈఈ డి.శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు స్పిల్‌ వే ఎగువ ప్రాంతం నుంచి దిగువకు నీరు వెళ్లే విధంగా మార్గాలు ఏర్పాటు చేశారు. రివర్స్‌ స్లూయిజ్‌ ద్వారా 50వేల క్యూసెక్కుల నీరు స్పిల్‌ ఛానల్‌ నుంచి గోదావరి నదిలోకి కలిసే పరిస్థితి ఉంది. 

నిర్వాసిత గ్రామాలకు రెవెన్యూ సిబ్బంది తరలింపు
ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసి నిర్వాసిత గ్రామాలకు రెవెన్యూ సిబ్బందిని పంపినట్లు పోలవరం ఇన్‌చార్జ్‌ తహసిల్దార్‌ జి.అర్జునరావు తెలిపారు. మూడు టూరిజం బోట్లు, ఒక స్పీడు బోటు, రెండు ఇంజిన్‌ పడవలు ఏర్పాటు చేశామన్నారు. వరద పరిస్థితిని పోలవరం సీఐ ఏఎన్‌ఎన్‌మూర్తి, ఎస్సై ఆర్‌.శ్రీను పరిశీలించారు. అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఐ తెలిపారు.  

ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా ఇన్‌ఫ్లో 
వరద నీటితో గోదావరి ఉరకలెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా 6,98,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లొ వచ్చి చేరుతోంది.  వశిష్ట గోదావరిపై విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్‌ బ్యారేజీ సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో మిగులు జలాలను ధవళేశ్వరం జలవనరుల శాఖ హెడ్‌వర్క్స్‌ అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 175 గేట్లను 01 మీటరు వరకు ఎత్తి బుధవారం 6,87,362 లక్షల  క్యూసెక్కుల మిగులు జలాలలను  సముద్రంలోకి వదిలారు. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం నుంచి నీటి మట్టం తగ్గుతోందని, దీనివల్ల గురువారం 8 లక్షల క్యూసెక్కుల వరదనీటిని వదిలే అవకాశం ఉందని ధవళేశ్వరం హెడ్‌ వర్క్స్‌ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 7 గంటలకు 9.00 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 38.80 అగుగుల నీటి మట్టం నమోదవగా రాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది. పోలవరం వద్ద 11.70 మీటర్లు, రాజమహేంద్రవరం బ్రిడ్జి వద్ద 15.47  మీటర్లు నీటి మట్టాలు పెరుగుతూ వస్తున్నాయి. సముద్రంలోకి భారీగా వరద నీటిని వదలడంతో  ప్రస్తుతం గోదావరి నది సరాసరి నీటి మట్టం 13.41 మీటర్లుగా నమోదైంది. 

డెల్టాలకు నీటి విడుదల తగ్గింపు 
ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమడెల్టాకు 3,500 క్యూసెక్కులు,  మధ్య డెల్టాకు 2,000 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 2,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు కాలువకు 627 క్యూసెక్కులు, నరసాపురం కాలువకు 991 అత్తిలి కాలువకు 196, తణుకు కాలువకు 488 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top