అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణాలు మాఫీ చేస్తాం.. ఆదుకుంటాం.. ఇది సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ.. కుటుంబానికి రూ. 1.50 లక్షల రుణాలు మాఫీ చేస్తాం..
అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణాలు మాఫీ చేస్తాం.. ఆదుకుంటాం.. ఇది సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ.. కుటుంబానికి రూ. 1.50 లక్షల రుణాలు మాఫీ చేస్తాం.. ఇది సీఎం బాధ ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీ.. పోనీ అదైనా పూర్తిస్థాయిలో మాఫీ చేశారా అంటే లేదు.. పైగా ఆధార్ నెంబర్, డాక్యుమెంట్లు సరిగా లేవంటూ అర్హత ఉన్న రైతుల రుణమాఫీ దరఖాస్తులను సైతం తిరస్కరిస్తుండడం గమనార్హం.
కర్నూలు(అగ్రికల్చర్): ఆలూరుకు చెందిన రాజేంద్ర కుమార్(ఆధార్ :779962279939) స్థానిక పీఎసీఎస్‌లో 2013 జూన్‌లో నాలుగెకరాల భూమిపై రూ.1.20 లక్షలు రుణం తీసుకున్నారు. గతంలో డాక్యుమెంట్లు ఇవ్వలేదనే కారణంతో అర్హత లభించలేదు. తర్వాత తగిన డాక్యుమెంట్లతో గ్రీవెన్స్ ఇచ్చుకోవాలని సూచించగా 1.బి, అడంగల్, టైటిల్‌డీడ్, పట్టాదారు పాసుపుస్తకం, అప్పు ధృవీకరణ పత్రం నకళ్లతో గత మే నెలలో దరఖాస్తు ఇచ్చారు. అయినా తిరస్కరణే. దీంతో రైతుపై రూ.28,200 వడ్డీ భారం పడుతోంది.
ఆలూరుకు చెందిన శాంతమ్మ (ఆధార్ నెంబరు 437895065733)దీ ఇదే పరిస్థితి. 2013 జూలైలో స్థానిక పీఎసీఎస్‌లో మూడెకరాలపై లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. అన్ని డాక్యుమెంట్లతో జూన్‌లో గ్రీవెన్స్ ఇచ్చినా అర్హత లేదు. ఈమెపై కూడా రూ.23500 వడ్డీ భారం పడింది. వేలాది మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ కానీ రైతుల నుంచి తగిన డాక్యుమెంట్లతో తిరిగి దరఖాస్తులు ఇచ్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మే, జూన్‌లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి గ్రీవెన్స్ స్వీకరించడంతో దాదాపు 40వేల మంది వినతులు సమర్పించారు. అయితే ఈ దరఖాస్తులను కనీసం పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. మళ్లీ పాతకారణాలనే చూపుతూ తిరస్కరించడం ఇందుకు నిదర్శన ం.
81,845 మందికి మాఫీ నిల్:
జిల్లా వ్యాప్తంగా 5,23,615 మంది రైతులకు రుణమాఫీ అర్హత ఉందని చెబుతూ వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి అప్‌లోడ్ చేశారు. మొదటి విడతలో 2,87,565 మంది, రెండో విడతలో 1,39,455 మందికి మాఫీ లభించింది. మూడో విడతకు గ్రీవెన్స్ ఇచ్చిన వారే 40వేల మంది ఉండగా 14,750 మందికి మాత్రమే అర్హత లభించింది. మొత్తంగా 4,41,770 మందికి ఉపశమనం లభించగా, 81,845 మంది మొండి చెయి ఎదురైంది. వీరందరూ బ్యాంకర్ల దృష్టిలో డిపాల్టర్లయ్యారు. 2013లో రుణం తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు వడ్డీ, అపరాధ వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోంది.
డీసీసీబీలో..
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రుణమాఫీకి అర్హత కల్గిన రైతులు 91,288 మంది ఉండగా మొదటి విడతలో 58,972 మంది, రెండో విడతలో 16,991 మంది, 3వ విడతలో 1,835 మంది ప్రకారం 77,798 మందికి ఉపశమనం లభించింది. మిగతావారికి మొండి చేయి చూపారు.