మోడల్‌ స్కూల్స్‌లో జీతాల కేకలు

Wages Stoped in AP Model Schools - Sakshi

నాలుగు నెలల నుంచి ఉపాధ్యాయులు

ఆరు నెలల నుంచి సిబ్బంది ఎదురుచూపు

మోడల్‌ స్కూల్స్‌లో ముడిపడని జీతాలు

ఒంగోలు టౌన్‌: జిల్లాలోని ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో జీతాల కేకలు వినిపిస్తున్నాయి. వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగు నెలల నుంచి ఉపాధ్యాయులకు, ఆరు నెలల నుంచి ఉపాధ్యాయేతర సిబ్బందికి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలని వారు ప్రశ్నిస్తున్నారు. మోడల్‌ స్కూల్స్‌ను సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోకి తీసుకొచ్చినా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నిర్లక్ష్యం కారణంగా అందులో పనిచేసే ఉపాధ్యాయులు సకాలంలో జీతాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. మోడల్‌ స్కూల్స్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉపాధ్యాయేతర సిబ్బందిని నియమించారు. వారికి సంబంధిత ఏజెన్సీ ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసలే తక్కువ జీతం, ఆపై నెలల తరబడి రాకపోవడంతో అప్పులు పుట్టే పరిస్థితులు కూడా లేవని వారు వాపోతున్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయా అని ఒకవైపు ఉపాధ్యాయులు, ఇంకోవైపు ఉపాధ్యాయేతర సిబ్బంది వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

11స్కూల్స్‌.. 222 మంది:జిల్లాలో 11ఏపీ మోడల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. ముండ్లమూరు, కనిగిరి, దర్శి, దోర్నాల, మార్కాపురం, రాచర్ల, వలేటివారిపాలెం మండలంలోని చుండి, లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం, కందుకూరు మండలంలోని జడ్‌ మేకపాడు, ఉలవపాడు మండలంలోని వీరేపల్లిలో 2013 జూన్‌లో మోడల్‌ స్కూల్స్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌లో చీరాలలో మరో మోడల్‌ స్కూల్‌ను ప్రారంభించారు. పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ని«ధులతో వీటిని నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమయంలో ఇందులో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రతినెలా జీతాలు వచ్చేవి. అయితే 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మోడల్‌ స్కూల్స్‌ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. అప్పటి నుండి అందులో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాల కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రతి మోడల్‌ స్కూల్‌లో ఆరుగురు ప్రిన్సిపాళ్లు, 129 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా డీఎస్సీ ద్వారా నియమితులైనవారే. వీరు కాకుండా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా 88 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో మోడల్‌ స్కూల్‌లో ఎనిమిది మంది చొప్పున ఉపాధ్యాయేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఆఫీసు ఫీల్డ్‌ కింద ఒక ఎల్‌డీసీ, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉండగా, టీచింగ్‌ ఫీల్డ్‌ కింద ఒక పీఈటీ, ఒక లైబ్రేరియన్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఇద్దరు చొప్పున అటెండర్లు, వాచ్‌మెన్లు పనిచేస్తున్నారు.

సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోకి వచ్చినా..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ ఒకేసారి వేతనాలు ఇచ్చేందుకుగాను ఇటీవల సెంట్రల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(సీఎఫ్‌ఎంఎస్‌)ను ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా ప్రతినెలా ఒకటి రెండు తేదీలో అందరికీ జీతాలు ఇస్తున్నారు. తమను కూడా సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోకి తీసుకురావడంతో మోడల్‌ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారు సీఎఫ్‌ఎంఎస్‌ పరి«ధిలోకి వచ్చినప్పటికీ జిల్లా విద్యాశాఖ కార్యాలయ రూపంలో జీతాలకు బ్రేక్‌లు పడుతున్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోకి రాకముందు మోడల్‌ స్కూల్స్‌కు సంబంధించిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులు జిల్లా విద్యాశాఖ కార్యాలయం తయారుచేసి ట్రెజరీ ద్వారా రాష్ట్ర విద్యాశాఖకు పంపించేవారు. అక్కడి ఏఓ బిల్లుల ప్రక్రియను పరిశీలించిన అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపించేవారు. నిత్యం బిజీగా ఉండే కమిషనర్‌ మోడల్‌ స్కూల్స్‌కు చెందిన ఉపాధ్యాయుల బిల్లులను చూసి సంతకం చేస్తేనే ఉపాధ్యాయులకు జీతాలు వచ్చేవికావు. ఇంత ప్రాసెస్‌ నడిచేసరికి నెలలు గడిచిపోవడం సర్వసాధారణమైంది. తమతోపాటు ఇతర పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఠంఛనుగా ప్రతినెలా జీతాలు తీసుకుంటుంటే, మోడల్‌ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

చేతులు తడపాల్సిందే..
సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా మోడల్‌ స్కూల్స్‌కు చెందిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నేరుగా ట్రెజరీకి బిల్లులు పెడితే సంబంధిత ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమవుతాయి. అయితే జిల్లా విద్యాశాఖ కార్యాలయం నిర్లక్ష్యం అందులో పనిచేసే ఉపాధ్యాయులకు శాపంగా మారింది. సీఎఫ్‌ఎంఎస్‌ కింద జీతాల బిల్లలు ట్రెజరీకి పంపించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. ముండ్లమూరు, కనిగిరి, చుండి, తిమ్మారెడ్డిపాలెం మోడల్‌ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆగస్టు నెల జీతాలు పడటం, మిగిలిన  వాటిలో పనిచేసే ఉపాధ్యాయులకు పడకపపోవడంపై అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారి జోక్యం చేసుకొని తమకు పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదలయ్యేలా చూడాలని మోడల్‌ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులు కోరుతున్నారు. అదే సమయంలో మోడల్‌ స్కూల్స్‌లో ఔట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా తమకు ఆరు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top