పట్టుబట్టి.. కట్టబెట్టి..

పట్టుబట్టి.. కట్టబెట్టి.. - Sakshi


వ్యాస్ కోటలో కాసుల వేట  రూ.1.70 కోట్లు

{పజాధనం దుర్వినియోగం

అదనపు అంతస్తులు  వద్దన్నా వినని పోలీస్ బాస్

కేంద్రమంత్రి కోర్టులో   పంచాయితీ

తాత్కాలికంగాపనులకు బ్రేక్


 

బందరురోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్‌పై రగడ మొదలైంది. రాజకీయ ఒత్తిళ్లు, రెండు ప్రభుత్వ కీలక శాఖల మధ్య అంతర్గత వివాదం వెరసి రూ.1.70 కోట్ల ప్రజాధనం వృథా అయింది. చివరకు ఈ పంచాయితీ టీడీపీకి చెందిన ఓ కేంద్రమంత్రి వద్దకు చేరింది. కేవలం ఒక పోలీస్ ఉన్నతాధికారి జోక్యంతో వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరికి పిల్లర్ల వద్ద నిలిచిపోయింది. ప్రాజెక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు తప్పుకోవటం మొదలు వారం రోజుల కిందట శ్లాబ్‌లు వేయటానికి వీలుగా ఏర్పాటుచేసిన సెంట్రింగ్ తొలగించటంతో కథ తాత్కాలికంగా ముగిసినా విలువైన ప్రజాధనం మాత్రం దుర్వినియోగమైంది.

 

విజయవాడ : బందరురోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్ నగర పోలీస్ కమిషనరేట్ ఆధీనంలో ఉంది. కిందిభాగంలో షాపింగ్ కాంప్లెక్స్, రెండో అంతస్తులో ట్రాఫిక్ పోలీస్ కార్యాలయాలు ఉన్నాయి. సుమారు ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. ఈ క్రమంలో దానిపై మూడు, నాలుగు అంతస్తులు నిర్మించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు పంపి దానికి ఆమోదముద్ర వేయించారు. దీంతో ఆర్‌అండ్‌బీ నిధులు రూ.1.70 కోట్లతో రెండంతస్తులు పోలీస్ కార్యాలయాల కోసం నిర్మించాలని భావించారు. అయితే, ఈ వ్యవహారం వెనుక ఓ పోలీస్ ఉన్నతాధికారి అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి.  శాఖాపరంగా అభివృద్ధిపై దృష్టిసారించటం మంచిదే కానీ, ఆయన పూర్తి ఏకపక్షంగా, అడ్డగోలుగా వ్యవహరించటం వల్లే సమస్య ఉత్పన్నమైంది.



 అసలు కథ ఇదీ..

 వాస్తవానికి ఆర్‌అండ్‌బీలో రహదారులు, బ్రిడ్జిలు నిర్మించే విభాగం ఒకటి, ప్రభుత్వ భవనాలు నిర్మించే విభాగం మరొకటి ఉన్నాయి. భవనాలు నిర్మించే విభాగం దీనిని బాధ్యతగా తీసుకుని టెండర్లు పిలవాల్సి ఉంది. అందుకు భిన్నంగా రహదారులు, బ్రిడ్జిలు నిర్మించే విభాగం టెండర్లు పిలవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల కాలవ్యవధితో టెండర్లు ఆహ్వానించగా, దానిని నగరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు సంయుక్తంగా దక్కించుకున్నారు. దీంతో మళ్లీ పోలీస్ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లతో తమశైలిలో మాట్లాడి టెండర్ నుంచి తప్పించి తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. దీంతో ఎట్టకేలకు ఆరు నెలల కిందట పనులు మొదలయ్యాయి.



ఈ క్రమంలో ఆర్‌అండ్‌బీ విభాగం అధికారులు భవనాన్ని పరిశీలించి భవన సామర్థ్యం, పిల్లర్ల బలం, సాయిల్ పరీక్షలు నిర్వహించారు. భవన సామర్థ్యం సరిపోదని, మరో రెండు అంతస్తులు నిర్మిస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పి పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. వాస్తవానికి ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చాక మొదలుకావాల్సిన పనులు దానితో నిమిత్తం లేనట్టుగానే మొదలుపెట్టారు. దీంతో సదరు అధికారి బదిలీ వరకు పనులు జరిగాయి.  అధికారి బదిలీతో నిలిచిపోయాయి. ఈ విషయమై పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారి, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్లు ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద పంచాయితీ పెట్టారు. పూర్తి చేయాలని పోలీస్ హౌసింగ్ కార్పొ           రేషన్ ఒత్తిడి తీసుకురాగా,  నిర్మాణం కుదరదని ఆర్‌అండ్‌బీ అధికారులు తేల్చిచెప్పారు. మరోవైపు ఓ పోలీసు ఉన్నతాధికారి జోక్యం చేసుకుని నిర్మించాల్సిందేనని ఒత్తిడి తేచ్చారు. ఈలోగా ప్రాజెక్ట్ కాలవ్యవధి మూడు నెలలు కూడా పూర్తి కావటంతో రెండు రోజుల కిందట శ్లాబ్‌ల కోసం అమర్చిన సెంట్రింగ్ పనులు నిలిపివేసి చెక్కలు తొలగించారు.

 

కేంద్రమంత్రి వద్ద పంచాయితీ

ఈ క్రమంలో ఈ భవనాన్ని ఎలా అయినా పూర్తి చేయించాలని, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి దీనిని పూర్తి చేయించాలని సదరు పోలీస్ ఉన్నతాధికారి కేంద్రమంత్రిని కోరి ఆయన వద్ద పంచాయితీ పెట్టారు. ఇటీవల నగరానికి వచ్చిన సదరు అమాత్యుడు పంచాయితీని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శేషు కుమార్ ‘సాక్షి’తో  మాట్లాడుతూ భవనం సామర్థ్యం పరీక్షలు నిర్వహించగా    పటుత్వం లేదని నిర్ధారించారని, దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top