క్రికెటర్ లక్ష్మణ్ ఈ-మెయిల్ హ్యాకింగ్ | VVS Laxman's Rs 10L intact in hacker's account | Sakshi
Sakshi News home page

క్రికెటర్ లక్ష్మణ్ ఈ-మెయిల్ హ్యాకింగ్

Feb 2 2014 12:53 AM | Updated on Sep 2 2017 3:15 AM

క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ-మెయిల్‌ను ఆగంతకులు హ్యాకింగ్ చేసి, ఆయన బ్యాంకు ఖాతాలోని రూ. 10 లక్షలను తస్కరించారు.

బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 లక్షలు తస్కరణ

 
సాక్షి, సిటీబ్యూరో: క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ-మెయిల్‌ను ఆగంతకులు హ్యాకింగ్ చేసి, ఆయన బ్యాంకు ఖాతాలోని రూ. 10 లక్షలను తస్కరించారు. ఈ డబ్బును కోల్‌కతాలోని బ్యాంకులో డ్రా చేయడానికి ప్రయత్నించిన అజీజ్ ఉల్ షేక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
 
 ఇద్దరు వ్యక్తులు తనకు కమీషన్ ఇస్తానంటేనే ఖాతా తెరిచానని నిందితుడు చెబుతుండటంతో అసలు ముఠా గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు శోధిస్తున్నారు. సైబరాబాద్ ఇన్‌చార్జి క్రైమ్ డీ సీపీ జానకీ షర్మిల శనివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మణ్‌కు ఎస్‌ఆర్ నగర్‌లోని డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంకు (డీసీబీ)లో ఖాతా ఉంది. ఆ ఖాతాలోని సొమ్మును మరేదైనా ఖాతాకు బదిలీ చేయాలంటే ఆ బ్యాంకు మేనేజర్‌కు లక్ష్మణ్ మెయిల్‌లో సమాచారం ఇస్తుంటారు. ఈ విషయం పసిగట్టిన హ్యాకర్లు లక్ష్మణ్ మెయిల్‌ను హ్యాక్ చేసి, కోల్‌కతాలోని బ్యాంకు ఆఫ్ ఇండియాలో గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్ ఖాతాకు రూ. 10 లక్షలు బదిలీ చేయాలని గురువారం లక్ష్మణ్ మెయిల్ నుంచి డీసీబీ మేనేజర్‌కు మెసేజ్ పెట్టారు.
 
 సొమ్ము బదిలీ కావడంతో లక్ష్మణ్ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన లక్ష్మణ్ డీసీబీ అధికారులకు, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన క్రైమ్ ఏసీపీ ప్రతాప్‌రెడ్డి కోల్‌కతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు గురువారం ఏటీఎం కార్డుతో  రెండు దఫాలుగా కొంత మొత్తం డ్రా చేశాడు. మిగతా సొమ్ము డ్రా చేసేందుకు బ్యాంకుకు వచ్చిన  అజీజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపర్చిన సైబరాబాద్ పోలీసులు, ఆ కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసే అజీజ్ 10రోజుల క్రితమే ఖాతా తెరిచాడు. అయితే ఈ హ్యాకింగ్ మోసంలో తనకేమీ సంబంధం లేదని అజీజ్ పోలీసులకు చెప్పాడు. ఇద్దరు ఆగంతకులు అజీజ్‌తో బ్యాంకుకు వచ్చినా పోలీసులు అతన్ని పట్టుకునేసరికి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.
 
 ఆదాల గెలుస్తాడు: జేసీ
 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధిస్తారని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నామని... సమైక్యవాదుల మద్దతును కూడగడుతున్నామని తెలిపారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో శనివారం జేసీ మీడియాతో మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement