వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే వీఆర్వో పరీక్షలకు 28,352 మంది, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరిగే వీఆర్‌ఏ పరీక్షలకు 888 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందు కోసం కడపలో 38, ప్రొద్దుటూరులో 16, రాజంపేటలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రభుత్వ సూచనలు పాటించాలని డీఆర్వో ఈశ్వరయ్య కోరారు.
అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి 20 నిమిషాల ముందు నుంచే అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
హాల్ టిక్కెట్లతోపాటు ఆధార్, ఓటరు గుర్తిపుకార్డు, పాన్ కార్డులలో ఏదో ఒకటి తప్పక తీసుకు రావాలి.
హాల్ టిక్కెట్లపై ఫొటో లేకపోవడం, పురుషులకు బదులు మహిళలు లేదా మహిళలకు బదులు పురుషులు అని నమోదు కావడం వంటి సమస్యలు ఉత్పన్నమైతే మూడుపాస్‌పోర్టు సైజ్ ఫోటోలపై గెజిటెడ్ అధికారుల సంతకం చేయించుకుని తీసుకు వస్తే అనుమతిస్తారు.
బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులు మాత్రమే ఉపయోగంచాలి.
వీఆర్వో ప్రశ్నాపత్రం కోడ్ 999, వీఆర్‌ఏ ప్రశ్నాపత్రం కోడ్ 888. నామినల్ రోల్స్‌లో అభ్యర్థుల సంతకంతోపాటు ఎడమచేతి బొటనవేలి ముద్ర వేయాలి.
ఓఎంఆర్ పత్రాన్ని నింపిన తర్వాత ఇన్విజిలేటర్ సంతకం తప్పనిసరి. ఓఎంఆర్ షీట్‌లో మొదటి వైపు పార్ట్-ఏ, బీ, సీలోని ఏ ఒక్క అంశాన్ని సక్రమంగా నింపకున్నా, వృత్తాలను బాల్ పాయింట్ పెన్నుతో నింపకున్నా, టెస్ట్‌బుక్‌లెట్ సీరీస్ నెంబరు, రోల్ నెంబరు, పేపర్ కోడ్ నింపకపోతే అభ్యర్థుల సమాధాన పత్రాలను పరిశీలించరు.ఓఎంఆర్ షీట్‌పై రఫ్ వర్క్ చేయడం, మడవడం, గీతలు, చింపడం, పిన్ చేయరాదు.ఏవైనా ఫిర్యాదులుంటే కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సి.గుణభూషణ్‌రెడ్డిని 98499 04116 నెంబరులో సంప్రదించాలి.