వీఆర్‌ఏల సమ్మెకు 50రోజులు! | Vra to strike in 50 days! | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల సమ్మెకు 50రోజులు!

Dec 21 2015 1:39 AM | Updated on Sep 3 2017 2:18 PM

కేవలం రెండు డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆదివారం నాటికి 50 రోజులు గడిచాయి.

కేవలం 2 డిమాండ్లకే స్పందించని ప్రభుత్వం
సీఎం, మంత్రులకు వినతులు అందించినా పట్టించుకోలేదు
సమ్మె విరమించబోమంటున్న సంఘ ప్రతినిధులు

 
బి.కొత్తకోట: కేవలం రెండు డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆదివారం నాటికి 50 రోజులు గడిచాయి. విధులకు హజరుకాకుండా, వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు తమగోడు చెప్పుకొని వినతులు అందించినా పట్టించుకోలేదు. దీంతో డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని సంఘ ప్రతినిధులు స్పష్టంచేస్తున్నారు. సమ్మె కారణంగా తహశీల్దార్ కార్యాలయాల్లో పనులు ఆగిపోతున్నాయి. 2012-14 మధ్య కాలంలో ఏపీపీఎస్సీ నేరుగా గ్రామ రెవెన్యూ సహయకులను నియమించేందుకు రెండు దశల్లో పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని వీఆర్‌ఏలుగా నియమించారు. ఇందులో ప్రస్తుత ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన 4,728 మంది వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నారు. వీరు నియమితులైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ సమ్మెలోకి వెళ్లలేదు. ప్రస్తుతం వీరంతా ప్రధానంగా రెండు డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో చివరిస్థానంలో ఉన్నారు. వీరికి అమలవుతున్న పేస్కేలునే తమకు వర్తింపచేయాలన్నది ప్రధాన డిమాండ్.  వీఆర్‌ఏలకు ప్రమోషన్ల శాతం 30 నుంచి 70శాతానికి పెంచాలన్నాది మరో డిమాండ్. ఈ రెండు డిమాండ్లను సాధించుకునేందుకు వీఆర్‌ఏలు నవంబర్ 2న సమ్మె బాట పట్టారు. అప్పటినుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీరి సమ్మెకు ఆదివారానికి 50రోజులు ముగిశాయి.

వాళ్లది వెట్టిచాకిరీ
ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన వీఆర్‌ఏలు వెట్టిచాకిరి చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ విధులు, బూత్ లెవల్ అధికారులుగా, పట్టాదారు ఆధార్ ఆన్‌లైన్ సీడింగ్, ఎన్నికల ఆధార్ సీడింగ్, కొత్త రేషన్‌కార్డుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, మీఇంటికి మీభూమి కార్యక్రమంలో అర్జీలను ఆన్‌లైన్ చేయడం, రీసెటిల్‌మెంట్ రిజిష్టర్ డేటా ఎంట్రీ, సర్కారు భూముల డేటా ఎంట్రీ, పట్టాదారు పాసుపుస్తకాల ఆన్‌లైన్, ప్రజలనుంచి అందే ఫిర్యాదుల కోసం ఏర్పాటైన మీకోసం వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల నమోదు, రాత్రివేళ వాచ్‌మెన్లుగా  తదితర పనులు చేస్తున్నారు. ఈ పనులేకాక వీరు ఎక్కువ విద్యార్హత కలిగి ఉండటంతో రికార్డు పనులకోసమూ వినియోగించుకొంటున్నారు. .
 
న్యాయం చేయాలి

మేం కేవలం రెండు సమస్యలపైనే సమ్మె చేస్తున్నాం. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు  మా గోడుపై ఏఒక్కరూ స్పందించలేదు. మాతో అన్ని పనులూ చేయించుకోంటూ పట్టించుకోకపోవడం అన్యాయం.  ఇలా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందో అర్థంకావడం లేదు.
 -జి.నరేంద్రబాబు
 వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement