గ్రూప్-1 ఫలితాలు విడుదల | APPSC Group 1 results released | Sakshi
Sakshi News home page

గ్రూప్-1 ఫలితాలు విడుదల

Jan 31 2026 5:15 AM | Updated on Jan 31 2026 5:15 AM

APPSC Group 1 results released

87 పోస్టులకు ఫలితాలు వెల్లడి 

హైకోర్టు ఆదేశాల మేరకు రెండు పోస్టుల ఫలితాలు పెండింగ్‌

సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఫలితాలను విడుదల చేసింది. 89 పోస్టులకు పరీక్షలు జరగ్గా శుక్రవారం తుది ఫలితాలను సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. స్పోర్ట్సు కోటాపై హైకోర్టులో ఇంకా కేసు పెండింగ్‌లో ఉండడంతో  రెండు పోస్టులు (అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్, డీఎస్పీ సివిల్‌) పక్కనపెట్టి, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 6న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు మిగిలిన 87 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. 

 వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో గ్రూప్‌–1నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2024 మార్చిలో ప్రిలిమ్స్‌ నిర్వహించారు. అదే ఏడాది మే/జూన్‌లో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ కూడా ప్రకటించారు. అయితే, ఎన్నికల ముందు ఈ పరీక్షలపై హైకోర్టులో పలు రకాల పిటిషన్లు వేయడంతో మెయిన్స్‌ పలుమార్లు వాయిదాపడి చివరికి 2025 మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. 

అనంతరం మెయిన్స్‌లో 182 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి జూన్‌ నెలలో ఓరల్‌ టెస్ట్‌ పూర్తి చేశారు.  శుక్రవారం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోస్టుల వారీగా విడుదల చేశారు. మొత్తం 15 రకాల పోస్టులకు కేటగిరీల వారీగా ఫలితాలను వెల్లడించారు.  

వివిధ కేడర్ల పోస్టులకు ఎంపిక ఇలా.. 
ఫలితాలు ప్రకటించిన 87 పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లు 9 మంది, స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌–17, డీఎస్పీ సివిల్‌–25, జైల్స్‌ డిప్యూటీ సూపరింటిండెంట్‌–1, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌–2, ఆర్టీవో (మల్టీజోన్‌–1)–6, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(మల్టీ జోన్‌–1)–1, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(మల్టీ జోన్‌–1)–3, డిప్యూటీ రిజి్రస్టార్స్‌ జోన్‌–2లో–4, జోన్‌ 4లో–2, గ్రేడ్‌–2 మున్సిపల్‌ కమిషనర్స్‌(మల్టిజోన్‌)–3, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ (మల్టిజోన్‌–1)–1, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌–3, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌–4, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌(జోన్‌–4)–2, ఎంపీడీవో–4 పోస్టులు ఉన్నాయి.

ప్రతిభకు ‘సలామ్‌’ 
ఆర్‌టీఓగా కార్పెంటర్‌ కుమారుడు 
నరసరావుపేట ఈస్ట్‌: సాధారణ కుటుంబం నుంచి గ్రూప్‌–1 స్థాయి అధికారిగా షేక్‌ యూసబ్‌ సలామ్‌ ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వరవకట్టకు చెందిన సలామ్‌ తండ్రి సుభాని కార్పెంటర్‌. తల్లి నాసర్‌బీ గృహిణి. ఏపీపీఎస్‌సీ ప్రకటించిన గ్రూప్‌–1 ఫలితాల్లో సలామ్‌ రీజినల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. పాఠశాల, ఇంటర్మీడియెట్‌ విద్యను పట్టణంలోనే పూర్తిచేసుకున్న సలామ్‌ బీటెక్, ఎంటెక్‌ చదివి తన దృష్టి సివిల్స్‌ వైపు మళ్లించారు. కఠోర శ్రమ చేశారు. సలామ్‌ తన రెండో ప్రయత్నంలో గ్రూప్‌–1కు ఎంపికయ్యారు. యూపీఎస్‌సీ పరీక్ష లక్ష్యంగా తన కృషి కొనసాగిస్తానని తెలిపారు.  

‘విజయ’ పుత్రుడు 
తొలియత్నంలో ఏఈఎస్‌ కొలువు  
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌ వన్‌ ఫలితాల్లో మార్కాపురం పట్టణానికి చెందిన ఒద్దుల వెంకట సుజిత్‌ రెడ్డి సత్తాచాటారు. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుకు ఎంపికయ్యారు. 2023లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన మొదటిసారిగా గ్రూప్‌ వన్‌ పరీక్ష రాసి ఏఈఎస్‌గా ఎంపికయ్యారు. ఆయన తండ్రి వీరారెడ్డి, తల్లి విజయ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సుజిత్‌ను హెచ్‌ఎం చంద్రశేఖర్‌ రెడ్డితోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

సూపర్‌ సురేష్.. ప్రతిభలో ‘సిద్ధ’హస్తం  
డిప్యూటీ కలెక్టర్‌గా కొలువు  
పెద్దతిప్పసముద్రం: మొన్న విడుదలైన గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటిన సురేష్‌ శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్‌–వన్‌ ఫలితాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివాండ్లపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన యదశంద్రం సిద్ధప్ప, సిద్ధమ్మ దంపతుల కుమారుడు సురేష్. ఈయన గత ప్రభుత్వంలో సచివాలయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. తొలుత గ్రూప్‌–2 పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. అలాగే గ్రూప్‌–1 పరీక్షలూ రాసిన సురేష్‌ విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.  

ఆర్టీఓగా ‘సంతోషి'oచే 
రావికమతం: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి సంతోషి గ్రూప్‌–1 ఫలితాల్లో సత్తా చాటి ఆరీ్టవోగా ఉద్యోగం సాధించారు. సంతోషి ఎంటెక్‌ చదివారు. ఆమె ప్రస్తుతం మాకవరపాలెం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌–1,2 పరీక్షలకు సిద్ధమయ్యారు. మంగళవారం విడుదలైన పలితాల్లో గ్రూప్‌–2లో విజయం సాధించి, అమరావతిలో అసిస్టెంట్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. 

శుక్రవారం విడుదలైన  గ్రూప్‌–1 ఫలితాల్లో సత్తాచాటి రీజినల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌(ఆర్‌టీఓ)గా ఉద్యోగం సాధించారు. సంతోషి మాకవరపాలెం మండలం సుబ్బారాయుడు గ్రామానికి చె«ందిన లగుడు సూర్యనారాయణ (లేటు), సత్యవతి కుమార్తె. తండ్రి సూర్యనారాయణ చిన్నతనంలో మరణించడంతో తల్లి ఆమెను కష్టపడి చదివించారు. ఇదిలా ఉంటే సంతోషి భర్త గోపి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.  

‘గౌరి’వప్రద విజయం  
డీఎస్పీగా శివనాగగౌరి  
ఎచ్చెర్ల: గ్రూప్‌–1 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎం పురం గ్రామానికి చెందిన సంపతిరావు శివనాగగౌరి సత్తాచాటారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. మొత్తం 25 మంది డీఎస్పీలుగా ఎంపిక కాగా శ్రీకాకుళం జిల్లా నుంచి శివనాగగౌరి ఎంపిక కావడం విశేషం. ప్రాథమిక విద్య, పదో తరగతి వరకూ శ్రీకాకుళం నగరంలోని మునసబుపేట వద్ద గల గాయత్రి స్కూల్‌లోనూ, ఇంటర్‌ విశాఖపట్నంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలో చదువుకున్నారు. అనంతరం తమిళనాడులోని వీఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఈ

మె 2017లో పోలవరం ప్రాజెక్ట్‌లో ఏఈఈగా ఎంపికయ్యారు. డిప్యుటేషన్‌పై ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ)గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లోనే ఈమె గెయిల్‌లో (గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌) ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. 

ఈమె అత్తమ్మ చౌదరి ధనలక్ష్మీ గతంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పనిచేశారు. ఈమె భర్త చౌదరి అవినాష్‌ ప్రస్తుతం డీసీఎంఎస్‌ చైర్మన్‌. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈమె గతంలో గ్రూపు–1 పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లి విఫలమయ్యారు. అయితే పట్టు వదలకుండా రెండో సారి ప్రయత్నించి విజయం సాధించారు.  

‘ఓంకార’నాదం  
డీఎస్పీగా ఓంకార వెంకట నాగేశ్వరరావు  
తెనాలి: తెనాలి నాజరుపేటకు చెందిన అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు గ్రూప్‌–1లో సత్తాచాటారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. నాగేశ్వరరావు తండ్రి కూరగాయల వ్యాపారి. తల్లి గృహిణి. 2010–14లో నరసరావుపేట ఇంజినీరింగ్‌ కాలేజిలో బీటెక్‌ చేసిన నాగేశ్వరరావు సివిల్స్‌ లక్ష్యంతో ఢిల్లీ వెళ్లాడు. పోటీపరీక్షలకు తయారయ్యాడు. 2019లో సచివాలయ పరీక్షలు రాసి పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో పనిచేస్తున్నారు. అయినా రాజీపడక గ్రూప్‌–1 పరీక్షలు రాశారు.  డీఎస్పీగా ఎంపికయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement