అధికార మంత్రం.. ఓటు కుతంత్రం! | Voter Lists Details IN TDP App | Sakshi
Sakshi News home page

అధికార మంత్రం.. ఓటు కుతంత్రం!

Feb 27 2019 12:08 PM | Updated on Feb 27 2019 12:08 PM

Voter Lists Details IN TDP App - Sakshi

చిత్తూరు మునిసిపల్‌ కార్యాలయంలో ఓట్ల తొలగింపు దరఖాస్తులు పరిశీలిస్తున్న తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, టీడీపీ యాప్‌లో నమోదైన కుటుంబ వివరాలు

ఇప్పటివరకు చంద్రగిరి నియోజకవర్గంలో వెలుగుచూసిన ఓట్ల తొలగింపు తాజాగా చిత్తూరుకు కూడా పాకింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా అధికార పార్టీ చాలా తెలివిగా పావులు కదుపుతోంది. చిత్తూరు నియోజకవర్గంలో దాదాపు 4 వేల మంది తమ ఓట్లను తొలగించాలని కోరినట్టు ఆన్‌లైన్‌లో వినతులు వచ్చాయి. తీరా విచారణకు వెళితే తాము అసలు ఆన్‌లైన్‌లో దరఖాస్తే చేసుకోలేదని అసలు వ్యక్తులు చెప్పడంతో నిస్సిగ్గుగా టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర బట్టబయలవుతోంది.

చిత్తూరు అర్బన్‌: ‘చిత్తూరు నగరంలోని ఆఫీసర్స్‌ లైన్‌లో కాపురముంటున్న హరి అనే వ్యక్తి పూతలపట్టు గృహనిర్మాణశాఖలో పనిచేస్తున్నారు. ఈయన ఓటు కూడా తొలగించాలని ఆన్‌లైన్‌ అభ్యర్థన వచ్చింది.’
ఇలా చిత్తూరు నియోజకవర్గంలో వేలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందాయి. సోమవారం చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో తహసీల్దారు చంద్రశేఖర్‌తో పాటు ఎన్నికల డెప్యూటీ తహసీల్దారు, ఇతర రెవెన్యూ అధికారులు ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులపై ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులు చూసి షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలో 8,020 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు ఇవ్వగా సవరణల కోసం 1,019మంది, బూత్‌ మార్పు కోసం 439 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో 4 వేల మందికి పైగా ఓట్లను తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

అసలు కథ ఇదీ..
ఓట్ల తొలగింపుపై టీడీపీ నేతలున్నట్లు పక్కాగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు యాప్‌నకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వే వివరాలను లింకు చేసినట్లు తెలుస్తోంది. ప్రజాసాధికార సర్వేలో సామాజిక వర్గాలు, ఓటర్ల వివరాలు, ఆధార్‌ కార్డుల నంబర్లు ఉండడంతో ప్రతి బూత్‌లో కనీసం రెండు వందల మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కుట్ర పన్నారు. దీనికితోడు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా..? అసంతృప్తిగా ఉన్నారా..? అంటూ సెల్‌ఫోన్లకు 1100 నంబరు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్‌తో ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయి. ఈ ప్రశ్నలకు అసంతృప్తిగా ఉన్నామని సమాధానం చెప్పేవారి సెల్‌ఫోన్‌ నంబర్లను నోట్‌ చేసుకుని ప్రజాసాధికార సర్వేలో ఉన్న సెల్‌ఫోన్‌తో సరిపోల్చి చూసుకుంటూ వారి ఓట్లను కూడా తీసేస్తున్నారని తెలుస్తోంది.

సైబర్‌క్రైమ్‌ దర్యాప్తు అవసరం
ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం, పోలీసుశాఖ రంగంలోకి దిగితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా ఓట్ల తొలగింపు కోరుతూ వచ్చిన దరఖాస్తులు ఏయే ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చాయో గుర్తిస్తే నిందితులను పట్టేయొచ్చు. దరఖాస్తులు నెట్‌ సెంటర్లలో చేసినట్లు గుర్తిస్తే స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా అసలు దోషులను గుర్తించొచ్చు. ఈ దిశగా అధికారయంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement