పోటీ పరీక్షలకు మంచి శిక్షణ ఇస్తాం : మంత్రి

Vishwaroop and Ranganatha Raju takes charge as ministers in AP - Sakshi

సాక్షి, అమరావతి : అమరావతిలోని సచివాలయం 4వ బ్లాక్‌లో పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి స్టడీ సెంటర్స్ ఫైల్‌పై మంత్రి సంతకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రీతి పాత్రమైన శాఖను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 'మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పని చేస్తాను. గత ప్రభుత్వం కేటాయించిన నిధులలో 10శాతం కూడా ఖర్చు చేయలేదు. దళితుల సంక్షేమం ఎస్సీ కార్పొరేషన్ కోసం కేటాయించిన వెయ్యి కోట్లలో 185కోట్లే ఖర్చు చేశారు. సోషల్ వెల్ఫేర్‌కి బడ్జెట్‌లో 4500కోట్లు కేటాయిస్తే 2600కోట్లు వెనక్కు వచ్చాయి. 8జిల్లాలలో స్టడీ సెంటర్స్ అందించే ఫైల్ మీద తొలి సంతకం చేశాను. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా మంచి శిక్షణ ఇస్తాం' అని తెలిపారు.

మరోవైపు బుధవారం పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి ఛాంబర్‌లో అడుగు పెట్టారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన వైఎస్‌ జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. నవ రత్నాలలో పేద  ప్రజలకు  ఇళ్ల నిర్మాణంకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 175 నియోజక వర్గాలలో 100శాతం ఇళ్ళ నిర్మాణము పూర్తి చేస్తామన్నారు. ఉగాది నుంచి ప్రారంభించి దశల వారీగా 25లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

శంకర నారాయణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 80వేల మంది నాయి బ్రాహ్మణులు, రజకులు 2.10 లక్షల మందికి 10వేల చొప్పున సాయం అందించేందుకు ప్రతిపాదనలపై తొలి సంతకం చేశారు. 'ఏపీలో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నవరత్నాలలో కూడా బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు' అని శంకర నారాయణ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top