ఆ‘పన్ను’ హస్తం

Vishakha Corporation Recovering With Tax Concession - Sakshi

ట్యాక్స్‌ రాయితీతో కోలుకుంటున్న కార్పొరేషన్‌ 3 నెలల్లో రూ.94 కోట్ల వరకూ వసూలు

మరో రూ.300 కోట్లు వసూళ్లకు నూతన ప్రణాళికలు 

ఆస్తి పన్ను, నీటి పన్నుల వసూళ్లుపై దృష్టి

5 శాతం రాయితీకి నేడే ఆఖరు 

కరోనా వైరస్‌ ధాటికి విలవిల్లాడిన మహా విశాఖ నగర పాలక సంస్థ.. మెల్లమెల్లగా కోలుకుంటోంది. మార్చి నెల నుంచి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిన కోవిడ్‌.. కొత్త ఆర్థిక సంవత్సరంలో రూపాయి.. రూపాయి పోగు చేసుకుంటోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాయితీ ప్రకటనతో ఖజానాకు కాస్త ఊరటనిస్తోంది. అయితే సర్వర్‌ సమస్య వేధిస్తోంది. ఫలితంగా పన్ను చెల్లింపుల కోసం ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. 

సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌ ప్రభావంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూలులో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. రూ.350 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నామని జీవీఎంసీ ప్రకటించినా.. లక్ష్యానికి రూ.120 కోట్ల దూరంలో కేవలం రూ.236 కోట్లతో సరిపెట్టుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీ ప్రకటన చేయడంతో నెమ్మది నెమ్మదిగా జీవీఎంసీ ఖజానాకు కాసులు వచ్చి చేరుతున్నాయి. మూడు నెలల్లో రూ.94.32 కోట్లు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా  వ్యాపారాలు దెబ్బతినడంతో పన్ను చెల్లింపులకు కూడా భారమవుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2019–20 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగిసిపోయింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. తొలుత ఏప్రిల్‌ నెలాఖరు వరకూ 5 శాతం రాయితీతో పన్ను చెల్లించుకునేందుకు జీవీఎంసీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడకపోవడంతో రాయితీ ప్రకటనను జూన్‌ 30వ తేదీ వరకూ పొడిగించడంతో పన్ను చెల్లింపుదారులు ఊరట చెందారు. ఏప్రిల్, మే, జూన్‌ 29వ తేదీ వరకూ మూడు నెలల కాలంలో మొత్తం రూ.94.32 కోట్లు వసూలయ్యాయి. 

మొరాయిస్తున్న సర్వర్లు 
ప్రతి సంవత్సరం వడ్డీ రాయితీ వంటి ప్రోత్సాహకాలు ప్రకటించిన సమయంలో పెద్ద మొత్తంలో పన్నులు వసూలవుతుంటాయి. రాయితీ కోసమే పన్ను చెల్లింపుదారులు చాలా వరకూ ఎదురుచూస్తుంటారు. లక్షల రూపాయలు పన్నులు చెల్లించే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, కార్యాలయాల యజమానులు కూడా రాయితీ రోజుల్లోనే పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా ప్రభావంతో మీసేవ, ఈసేవ కేంద్రాల్లో పన్ను చెల్లింపుల్ని నిలిపివేశారు. దీంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సౌకర్యం కేంద్రంతో పాటు అన్ని జోనల్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లపైనే ఆధారపడ్డారు. కొంత మంది మాత్రమే డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్‌ ఎప్పటిలాగానే మొరాయించడంతో పన్ను చెల్లింపుదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి సౌకర్యం సెంటర్‌తో పాటు జోనల్‌ కార్యాలయాల వద్ద బారులు తీరుతూ పన్ను చెల్లింపు కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. సర్వర్‌ మాటిమాటికీ మొరాయిస్తుండటంతో చాలా మంది చెల్లింపులు పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. 

మూతపడిన జోన్‌–3 కార్యాలయం 
జోన్‌–3 పరిధిలో 49,066 అసెస్‌మెంట్లు ఉన్నాయి. మొత్తం ఈ కార్యాలయ పరిధి నుంచి రూ.50.72 కోట్లు పన్ను చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే ఇటీవలే జోన్‌–3 కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడంతో ఆ కార్యాలయ పరిధిలో పన్ను చెల్లింపు కేంద్రాన్ని మూసివేశారు. దీంతో ఆ పరిధిలో ఉన్న చెల్లింపుదారులంతా సమీపంలో ఉన్న ప్రధాన కార్యాలయ సౌకర్యం కేంద్రంపైనే ఆధారపడ్డారు. దీంతో సోమవారం ఇక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి.

చివరి అవకాశం వినియోగించుకోండి.. 
కమిషనర్‌ సూచనల మేరకు జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన పన్ను చెల్లింపు కౌంటర్లని సది్వనియోగం చేసుకోవాలి. లాక్‌డౌన్‌ కాలంలోనూ పన్ను చెల్లింపులు సజావుగా నిర్వహించాం. లాక్‌డౌన్‌ కారణంగా పరిమితులు ఉండడంతో చెల్లింపుల్లో జాప్యం జరిగింది. లేదంటే గతేడాది కంటే మెరుగ్గానే పన్నులు వసూలయ్యే అవకాశం ఉండేది. మంగళవారం రాయితీకి చివరి రోజు కావడంతో ప్రజలంతా ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
–ఫణిరామ్, జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్‌(రెవెన్యూ)  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top