అతను చనిపోయాడన్న వార్తలు అవాస్తవం : విశాఖ కలెక్టర్‌

Visakhapatnam Collector Press Meet On CoronaVirus Precautions - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఐసోలేషన్‌ వార్డులో బాధితుడికి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. అతను చనిపోయాడనే వార్తలు అవాస్తమని.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ నగరంలో క్వారంటైన్ కోసం నాలుగు వేల బెడ్స్‌ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో 500 పైగా బెడ్స్ని ఐసోలేషన్ కోసం వినియోగించుకోనున్నట్టు చెప్పారు. విశాఖలో ఒక పాజిటివ్ కేసు నమోదైందని.. ఈ నేపద్యంలో 115 బృందాలతో మరొకసారి‌ కొన్ని ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నెలాఖరువరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ మూసివేశామన్నారు. కరోనాపై ఎవరూ భయాందోళనలు చెందవద్దని.. కరోనాపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. 

విద్యార్థులు ఇంటి వద్దే ఉండాలి : ఏయూ రిజిస్టార్‌
కరోనా దృష్ట్యా ఆంధ్ర్ర యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లను ఖాళీ చేయించిన అధికారులు 9 వేల మందికి పైగా విద్యార్థులను, పరిశోధకులను స్వస్థలాలకు తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూజీసీ ఆదేశాల ప్రకారం మార్చి 31వరకు విద్యార్థులతోపాటు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్టు రిజిస్టార్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. మార్చిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. మార్చి 31 తర్వాత సమీక్ష అనంతరం తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులు బయట తిరగకుండా ఇంటి వద్దే ఉండాలని సూచించారు. 

సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు : మంత్రి అవంతి
కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రజలను కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా నగరంలోని వివిధ రంగాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రి అవంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు అతిగా భయపడవద్దని, అలా అని నిర్లక్ష్యం కూడా వహించవద్దని తెలిపారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా సోకదని.. ఒకరినొకరు ముట్టుకోవడం వలన వ్యాపిస్తుందని చెప్పారు. మార్చి 31వ తేదీ వరకు అత్యవసర పని ఉంటే తప్ప నగరవాసులు బయటకు రావద్దని సూచించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. పెళ్లిలు, ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థలు తప్పకుండా సెలవులు ప్రకటించాలన్నారు. 

చదవండి : ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top