జిల్లా వ్యాప్తంగా కరెంట్ కోతలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. అధికారిక కోతలకు అనధికారిక కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు.
సాక్షి, కడప: జిల్లా వ్యాప్తంగా కరెంట్ కోతలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. అధికారిక కోతలకు అనధికారిక కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. సింహాద్రి, వీటీపీఎస్, ఎన్టీపీసీ, కేటీపీఎస్‌లో సాంకేతిక కారణాలతో దాదాపు 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సమైక్యాంధ్ర సమ్మె వల్ల థర్మల్‌పవర్ ప్రాజెక్టులకు సింగరేణి నుంచి రావాల్సిన బొగ్గు సరఫరా తగ్గిపోయింది. సరిపడినంత బొగ్గులేక విద్యుత్ ఉత్పత్తి తగ్గి కోతలు అనివార్యమయ్యాయి.
అవసరాలకు తగ్గ సరఫరా ఏదీ?:
జిల్లాలోని వ్యవసాయ, గృహావసర కనెక్షన్‌లతో పాటు పరిశ్రమలకు కలిపి రోజుకు 10.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. ఈ మేరకు కరెంటు సరఫరా అయితే ఎలాంటి కోతలు లేకుండా చూడొచ్చు. అయితే ఈ నెలలో 9.74 మిలియన్ యూనిట్ల సరఫరాను డిస్కంలు కోటాగా నిర్ణయించాయి. ప్రస్తుతం మూడురోజులుగా ఈ సరఫరాలో కూడా గండిపడుతోంది. దీంతో జిల్లాలో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు.
పట్టణాల నుంచి పల్లెల వరకూ తప్పని కోత
ప్రస్తుతం విద్యుత్ సరఫరాలోని సమస్యల నేపథ్యంలో అధికారికంగా కార్పొరేషన్‌లో 3 గంటలు, మునిసిపాలిటీలలో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటలు కోతలను అధికారులు ప్రకటించారు. అయితే కార్పొరేషన్‌లో అదనంగా మరో గంట, మునిసిపాలిటీలో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8గంటలు కోతలు విధిస్తున్నారు. పల్లెల్లో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ఇళ్లలోని బల్బులు వెలగని పరిస్థితి. కార్పొరేషన్, మునిసిపాలిటీలలో 10-15 నిమిషాల పాటు రోజుకు నాలుగైదుసార్లు కరెంటు పోయి వస్తోంది. దీంతో వ్యాపారుల నుంచి రైతుల వరకూ అన్ని వర్గాల ప్రజలు కోతలతో ఇబ్బంది పడుతున్నారు.
పంటలకు, పరిశ్రమలకు తీవ్ర నష్టం :
జిల్లాలో 57వేల హెక్టార్లలో వరిపంట సాగులో ఉంది. అధికశాతం పంట పొట్టదశలో ఉంది. ఈ సమయంలో తోటలో ఎప్పటికీ నీరు ఉండాలి. అయితే మూడురోజులుగా కోతల ప్రభావంతో వ్యవసాయ విద్యుత్‌కు ఆటంకం ఏర్పడుతోంది. జిల్లాలో 1.15 లక్షల విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. వీటికి రోజుకు 7 గంటలు కరెంట్ సరఫరా చేయాలి. అయితే ప్రస్తుతం 3-4 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతోంది. ఇది కూడా విడతల వారీగా సరఫరా కావడంతో పొలాలకు సాగునీరు అందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అలాగే వాణిజ్య కనెక్షన్‌లు 51,471 ఉన్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 5265 కనెక్షన్లు ఉన్నాయి. కరెంట్ కోతలతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.
ఈ కోతలు మాకే అర్థం కావడం లేదు.: ఏసీ గంగయ్య, ఎస్‌ఈ, ఎస్‌పీడీసీఎల్
అధికారికంగా మేము కోతల వేళలను ప్రకటించాం. అయితే మూడురోజులుగా అప్రకటిత కోతలు విధిస్తున్నాం. ఎప్పుడు కోతలు విధించాల్సి వస్తుందో మాకే అర్థం కాలేదు. పలుప్లాంట్లలో సాంకేతిక సమస్యలు, బొగ్గుసరఫరాలో ఆటంకం వల్ల కోతలు తప్పడం లేదు. రెండురోజుల్లో పరిస్థితి దారికి రావొచ్చు.