విజయమ్మ దీక్షకుసంఘీభావం | Vijayamma fast decision was widely welcomed | Sakshi
Sakshi News home page

విజయమ్మ దీక్షకుసంఘీభావం

Aug 16 2013 1:41 AM | Updated on May 28 2018 1:52 PM

విజయమ్మ దీక్షకుసంఘీభావం - Sakshi

విజయమ్మ దీక్షకుసంఘీభావం

అన్ని ప్రాంతాలకు సమన్యాయం పాటించాలని, లేదంటే రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 నుంచి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ

సాక్షి, విజయవాడ : అన్ని ప్రాంతాలకు సమన్యాయం పాటించాలని, లేదంటే రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19 నుంచి వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్షకు సంఘీభావం పెరుగుతోంది. దీక్షకు ఏపీ ఎన్జీవోలు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు విజయమ్మను రాజధానిలో కలిసి ఆమరణ దీక్ష నిర్ణయాన్ని స్వాగతించారు.
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఎవరు పూనుకున్నా తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే పొలిటికల్ జేఏసీ కూడా విజయమ్మ దీక్షకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న వారందరూ విజయమ్మ దీక్ష నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 అధికార కాంగ్రెస్‌తో పాటు దానికి కొమ్ముకాస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ద్వంద్వ వైఖరులతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుండగా, సమైక్యం కోసం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసింది వైఎస్సార్ సీపీ నుంచే కావడంతో ప్రజలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. సమైక్యం కోసం ఏకంగా ఒక పార్టీ అధినేత్రి ఆమరణ దీక్షకు దిగడం వల్ల ఉద్యమానికి మద్దతు పెరుగుతుందని సమైక్యవాదులు భావిస్తున్నారు.
 
 నేడు దీక్షా వేదిక ఖరారు..
 ఈ నెల 19 నుంచి విజయమ్మ చేపట్టనున్న ఆమరణ దీక్ష వేదికను శుక్రవారం ఖరారు చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ గవర్నింగ్ బాడీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం విజయవాడ రానున్నారు. ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల కన్వీనర్లు వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, అడుసుమిల్లి జయప్రకాష్ తదితరులతో ఆయన సమావేశమై వేదిక ఖరారు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement