వైఎస్‌ జగన్‌పై వేణుగోపాల్‌ ఆంక్ష 

Venugopal restriction on YS Jagan - Sakshi

రెండు వారాలుగా బయట నుంచి కాఫీని అనుమతించని ఎయిర్‌పోర్టు సీఎస్‌ఓ

ఫ్లాస్క్‌ సైతం స్వాధీనం.. ఆ తర్వాతే దుండగుడు శ్రీనివాసరావు హత్యాయత్నం

సీఎం, లోకేష్, గంటా, వెలగపూడిలకు మాత్రం బయట నుంచే సరఫరా

రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌తో చెట్టాపట్టాల్‌

నిందితుడు కత్తులతో వస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారో..

అనుమానాలకు తావిస్తున్న సీఎస్‌ఓ వైఖరి

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో కుట్రదారులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో) వేణుగోపాల్‌ వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోంది. జగన్‌పై హత్యాయత్నం చేసిన దుండగుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరితో చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరగడంతో వేణుగోపాల్‌ ఆ కుట్రకు సహకరించారన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఇటీవల కాలంలో కప్పు కాఫీ కూడా బయటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతుల్లేవని నానా హంగామా చేసిన వేణుగోపాల్‌.. కత్తులు తీసుకుని ఎయిర్‌పోర్టులోకి వస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే జగన్‌ను అంతమొందించాలనే కుట్రలో భాగంగా బయటి నుంచి కాఫీలకు కూడా అనుమతుల్లేవంటూ హడావుడి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

వైఎస్‌ జగన్‌కు బయట కాఫీకి ‘నో’
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గత కొంతకాలంగా ఎయిర్‌పోర్టుకు విచ్చేస్తున్న సందర్భాల్లో పార్టీ 42వ వార్డు అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్‌ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే సందర్భాల్లో మాత్రమే ఫ్లైట్‌ చెకింగ్‌కు సమయముంటే వీవీఐపీ లాంజ్‌లో కాసేపు ఆగి కాఫీ తాగి వెళ్లేవారు. అయితే, రెండు వారాల క్రితం బయటి నుంచి కాఫీ తీసుకురావడంపై సీఎస్‌వో వేణుగోపాల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్‌ ఉండగా, బయటి నుంచి కాఫీలు తెచ్చుకుంటే అద్దెలు కట్టుకుంటున్న రెస్టారెంట్‌ వారి పరిస్థితి ఏమవుతుందని చిందులు తొక్కారు. ఇందుకు శ్రీధర్‌తోపాటు పార్టీ నేతలు.. జగన్‌ గారు ఒక్కరికే ఇంటి నుంచి తీసుకువస్తాం.. మిగిలిన వారంతా రెస్టారెంట్‌ నుంచే కొనుగోలు చేస్తామని చెప్పారు.

అందుకు కూడా కుదరని వేణుగోపాల్‌ ఖరాకండిగా చెప్పారు. పైగా శ్రీధర్‌ ఇంటి నుంచి తీసుకొచ్చిన కాఫీ ఫ్లాస్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెండు వారాలుగా రెస్టారెంట్‌ నుంచే కాఫీ, టీలు కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే అదనుగా దుండగుడు శ్రీనివాసరావు వీవీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌పై హత్యాయత్నం చేయడం చూస్తుంటే బయట నుంచి తీసుకువస్తున్న కాఫీని వేణుగోపాల్‌ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లే కాదు.. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు కూడా బయటి నుంచి ఫుడ్‌ తెచ్చుకుని మరీ ఎయిర్‌పోర్ట్‌ వీవీఐపీ లాంజ్‌లో కూర్చుని తీసుకుంటుంటారు. వీరి విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించని వేణుగోపాల్‌.. జగన్‌ విషయంలోనే వివాదం చేయడంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top