చిరుద్యోగులకు ఊరటనిస్తారా..

Union Budget : can government give any relief to small employees - Sakshi

సాక్షి, అమరావతి : బడ్జెట్‌ అంటేనే చిరుద్యోగులు దడదడలాడుతుంటారు. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని కంగారు పడుతుంటారు. చిరుద్యోగి జాతకంలో ఎప్పుడూ ఆదాయం 2గా ఉంటే వ్యయం 12గా ఉంటోంది. ఈ సారైనా కేంద్ర బడ్జెట్‌లో తమను కనికరిస్తారా అనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న చాలామంది మధ్యతరగతి, చిరు ఉద్యోగులు జీతాలు సరిపోక, పన్నులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచి ఆర్థికమంత్రి ఉద్యోగులకు ఊరటనిస్తారని ఆశిస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు తారస్థాయికి చేరడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ స్థాయిలో జీతాలు మాత్రం పెరగడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత రెండేళ్ల నుంచి వ్యాపారాలు లేక ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదని, కానీ ధరలు మాత్రం 20 నుంచి 30 శాతం పెరిగిపోవడంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థంకావడం లేదని చీరాలకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కిశోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

జీతాల పెరుగుదల లేదు
ధరలు పెరుగుతున్న స్థాయిలో జీతాలు పెరగడం లేదు. దీనికితోడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటివాటితో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలా సంస్థలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచలేని పరిస్థితి. ఇప్పుడు చేతికి అందుతున్న జీతం 15వ తేదీ రాకుండానే ఖర్చు అయిపోతోంది. ఈ బడ్జెట్‌లోనైనా ఆదాయ పన్ను పరిమితి పెంచితే కొంతైనా ఊరట లభిస్తుంది.
కె. నారాయణరావు, ప్రైవేట్‌ ఉద్యోగి, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా

విజయవాడలో పెరిగిన ఖర్చులు
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలి రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఇంటి అద్దెలు, ఇతర వ్యయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో నగరాల్లో పనిచేసే హెచ్‌ఆర్‌ఏ నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేయాలి. అలాగే పెరిగిన జీవనవ్యయాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్‌ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలి.
జి.గణేష్‌ కుమార్, ప్రభుత్వ ఉద్యోగి, అమరావతి.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top