కిడ్నీ బాధితులకు ‘భరోసా’

Uddanam Kidney victims happy with the Announcement of YS Jagan ten thousand pension - Sakshi

నెలకు రూ.10 వేల పింఛను..  జగన్‌ సర్కారు ప్రకటనతో కిడ్నీ బాధితుల హర్షం

ప్రస్తుతం రాష్ట్రంలో డయాలసిస్‌ బాధితులు 8,500

ఏటా వెచ్చించనున్న ప్రభుత్వం మొత్తం  రూ.102 కోట్లు

గతంలో ఇచ్చిన పెన్షన్‌ రూ.2,500 

ఎన్నికల ముందు రూ.3,500కు పెంపు

ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి/శ్రీకాకుళం (పాత బస్టాండ్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర చివరి దశకు చేరుకున్న రోజులవి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్‌ జగన్‌ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృద్ధాప్య, వితంతు పెన్షన్లతోపాటు కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేసే నాటికి కిడ్నీ బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.2,500 ఇచ్చేది. ఆయన పాదయాత్ర అనంతరం మరో వెయ్యి పెంచి ఎన్నికల ముందు నుంచి రూ.3,500 చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల బాధను మరచిపోయేలా చేశాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

వేలాది కుటుంబాలకు ఆసరాగా..
రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్‌ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1నుంచి రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లించనున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. 

మా పాలిట దేవుడు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మా పాలిట దేవుడయ్యారు. కిడ్నీ డయాలసిస్‌ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు అప్పుల ఊబిలో మునిగిపోయిన మాకు పింఛను నెలకు రూ.10 ఇవ్వనుండటంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
– కొరికాన లక్ష్మీకాంతం, పెద్ద శ్రీరాంపురం, కంచిలి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top