మరో రెండు మృత దేహాలు లభ్యం

Two young people died In Penna River - Sakshi

పెన్నాలో గల్లంతైన ఇద్దరు యువకులు మృతి

ఊబిలో చిక్కుకొని ఉన్న మృత దేహాలు

ఏడు గంటలు శ్రమించి వెలికితీసిన ఈతగాళ్లు

సిద్దవటం : పెన్నానదిలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయని ఒంటిమిట్ట సీఐ రవికుమార్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి నదిలో అన్వేషించిన ఈతగాళ్లు ఏడు గంటలపాటు శ్రమించి రెండు మృతదేహాలను వెలికితీశారన్నారు. పెన్నానదిలో సరదాగా ఈత కోసం స్నేహితులతో కలిసి వచ్చిన కడప మృత్యుంజయకుంటకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతైన విషయం విదితమే. 

  వీరిలో డేరంగుల లోకేష్‌(22) మృతదేహం ఆదివారం సాయంత్రమే వెలికితీయగా, మిగిలిన ఇద్దరు యువకులు బత్తల రవి(27) షేక్‌ ఫైరోజ్‌(18)మృతదేహాలను చీకటి పడటంతో వెలికితీయ లేకపోయామన్నారు.  సోమవారం పోలీసులు ఆధ్వర్యంలో ఈతగాళ్లు వలలు వేసి వెదుకులాట ప్రారంభించారన్నారు. మొదట బత్తల రవి మృతదేహం లభ్యంకాగా, తర్వాత చాలా సేపటికి గానీ షేక్‌ ఫైరోజ్‌ మృతదేహం ఆచూకీ లభించలేదు. ఊబిలో కూరుకుపోయి ఉండటం వల్లే అతని మృతదేహం జాడ తెలియడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఎట్టకేలకు ఫైరోజ్‌ మృతదేహాన్ని 11.30 గంటల ప్రాంతంలో వెలికితీశారని చెప్పారు. 

విలపించిన కుటుంబ సభ్యులు
తొలుత బత్తల రవి మృతదేహం బయట పడగానే ఆయన   భార్య మౌనిక, కుటుంబీకులు బోరున విలపించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. మెడికల్‌ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న రవికి రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది, వారికి 14 నెలల బాబు   ఉన్నాడు. ఫైరోజ్‌ తల్లిదండ్రులు పెన్నానది వద్దనే చాలా సేపటి వరకూ మృత దేహం కోసం  పడిగాపులు కాశారు. టైలరింగ్‌ పనిచేసే  షేక్‌ దాదాపీర్, ఆఫ్తాబ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా షేక్‌ ఫైరోజ్‌ చిన్నవాడు. ఇతను ఆర్ట్స్‌ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్‌ చదువుతున్నాడు. ఫైరోజ్‌ మృతదేహం బయటపడగానే అతని తల్లిదండ్రులు, బంధువులు కంటతడి పెట్టారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top