గాలింపు చర్యలు ముమ్మరం | two state police searching for ATM Offender person | Sakshi
Sakshi News home page

గాలింపు చర్యలు ముమ్మరం

Dec 13 2013 3:05 AM | Updated on Sep 2 2017 1:32 AM

పలు కీలకమైన కేసుల్లో ఎంతో నేర్పుతో నిందితులను అరెస్టు చేసిన ఘనత ఉన్నా, బెంగుళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన కేసులో నిందితుడి ని పట్టుకోవడంలో మాత్రం కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

 పెనుకొండ, న్యూస్‌లైన్:  పలు కీలకమైన కేసుల్లో ఎంతో నేర్పుతో నిందితులను అరెస్టు చేసిన ఘనత ఉన్నా, బెంగుళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన కేసులో నిందితుడిని పట్టుకోవడంలో మాత్రం  కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. సంఘటన అనంతరం నిందితుడు జిల్లాలో తలదాచుకుని ఉండవచ్చన్న అనుమానంతో కొన్ని రోజులుగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా పోలీసులు సైతం నిందితుని కోసం ప్రత్యేక నిఘా ఉంచారు. కర్ణాటకకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు పోలీసు కమిషనర్ స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు పలువురు అధికారులు గాలింపుల్లో పాల్గొంటుండడంతో వీరప్పన్‌ను పట్టుకోడానికి తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ గుర్తుకు వస్తోందని స్థానికులు అంటున్నారు.

గ్రామాల్లో ఎక్కడ చూసినా రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు నిందితునికి సంబంధించిన చిత్రాలను పంచడంతోపాటు, పట్టణంలోని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, తదితర రద్దీ ప్రాంతాలన్నింటి వద్ద వాటిని అతికించినా ఫలితం లేకుండా పోతోంది. నిందితుని ఆచూకీ కాదు కదా, కనీసం అతను ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడన్న వివరాలపై కూడా ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. నిందితుడు పెనుకొండ ప్రాంతంలోనే తలదాచుకున్నాడన్న అనుమానంతో  పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫలితం ఆశాజనకంగా లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement