రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం | two member died in road accident in Kondavidu | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Nov 25 2013 3:43 AM | Updated on Aug 30 2018 3:56 PM

కొండవీడు-సొలస రోడ్డులో ఫిరంగిపురం శివారు బ్రిక్స్ కంపెనీ వద్ద ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

ఫిరంగిపురం, న్యూస్‌లైన్ :కొండవీడు-సొలస రోడ్డులో ఫిరంగిపురం శివారు బ్రిక్స్ కంపెనీ వద్ద ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఇద్దరూ స్నేహితులు వనసమారాధనకు వెళ్లి తిరిగివస్తుండగా మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన షేక్ కాగజ్ అబిద్ (30), మండలంలోని బేతపూడికి చెందిన షేక్ ఆదంషఫీ (35)లు కొండవీడు కొండల్లో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమాలకు వెళ్లారు.
 
 తిరుగుప్రయాణంలో అబిద్ తన మిత్రుడు ఆదంషఫీని ఫిరంగిపురంలో దించేందుకు బైక్‌పై వస్తున్నారు. గణపవరం నుంచి పత్తి విత్తనాల లోడ్‌తో ఫిరంగిపురం వైపు వేగంగా వస్తోన్న లారీ ముందు వెళుతున్న బైక్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న ఆబిద్‌పై నుంచి రెండు చక్రాలు ఎక్కడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. వెనక కూర్చున్న ఆదం షఫీ మిత్రుడు లారీ కింద పడిపోతాడేమోనని అతని చేతిని పట్టుకోవడంతో లారీ ఈడ్చుకుంటూ వెళ్లి రెండు చక్రాలు తలపై ఎక్కింది. దీంతో అతను కూడా అక్కడిక్కడే మృతిచెందాడు. ఫిరంగిపురం ఏఎస్‌ఐ ఎస్‌కె.మహబూబ్ జాని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను సోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ పరారీ కాగా.. లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
 
 గ్రామస్తుల కన్నీటిపర్యంతం..
 కొండవీడు గ్రామానికి చెందిన ఆబీద్ స్థానిక సొలస బస్టాండ్ సెంటర్‌లో రెండేళ్ల క్రితం బట్టల షాపు పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆయనకు భార్య కాగజ్ షమీలా, మూడేళ్ల కుమారుడు, నలభై రోజలు బాబు ఉన్నారు. బేతపూడికి చెందని ఆదంషఫీకి భార్య మహబూబ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను ప్రతిరోజూ స్థానిక ఆంధ్రాబ్యాంక్, ఫిరంగపురం గ్రామంలో తిరిగి ఐస్‌క్రీమ్ అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. తమ కళ్లముందే కనిపించే ఇద్దరు మిత్రులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కంటతడిపెట్టారు. తమకుటుంబానికి పెద్దదిక్కుఅయిన తన తమ్ముడు మరణించాడని తెలుసుకొని ఫిరంగిపురం గ్రామానికి చెందిన ఆబీద్ అక్క షేక్ రిజ్వానా సంఘటనా స్థలానికి చేరుకొని తన మరదలు రెండో బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలల గడవక ముందే ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం దురదృష్టమయ్య అంటూ గుండెలివిసేలా విలపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement