
మూతపడిన చదలవాడ పాఠశాల
చింతూరు (రంపచోడవరం): మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అధికారులు ఉన్నారనడానికి ఇదోక సాక్ష్యం. ఒక పంచాయతీ పరిధిలోని రెండు పాఠశాలలు ఏడాదిగా మూతపడి ఉన్నట్టు తమకు సమాచారం అందలేదని అధికారులు తాపీగా చెబుతున్నారు. చింతూరు మండలంలోని చదలవాడ పంచాయతీ పరిధిలోని లక్కగూడెం, చదలవాడల్లో రెండు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 30 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. లక్కగూడెం పాఠశాలను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తెరవలేదు. గతేడాది సజావుగానే నడిచినా టీచర్ లేక పాఠశాల తెరువలేదు. లక్కగూడెంతో పాటు కొండరెడ్ల గుంపునకు చెందిన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. విద్యకు దూరమైన పిల్లలు పొలం పనులకు, పశువులు కాసేందుకు వెళుతున్నారు.
చదలవాడలోనూ అదే పరిస్థితి
చదలవాడ పాఠశాలదీ ఇదే పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక టీచర్ దేవి బదిలీ కావడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆ గ్రామస్తులు తెలిపారు. అనంతరం గ్రామానికే చెందిన ఓ యువకుడిని స్కూల్లో వలంటీర్‌గా నియమించారు. విద్యార్థులకు కొంతకాలం పాఠాలు బోధించిన అతడికి వేతనం ఇవ్వకపోవడంతో మానేశాడు. అప్పటి నుంచీ చదలవాడ పాఠశాల మూతపడి ఉందని ఆ గ్రామస్తులు తెలిపారు. విద్యకు దూరమైన కొంతమంది పిల్లలకు అంగన్‌వాడీ టీచర్ మడివి బాయమ్మ పాఠాలు చెబుతున్నారు. ఈ విషయం అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.