చెన్నూరు మండలం ఉప్పరపల్లె పంచాయతీ నరసారెడ్డిపల్లె సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పురుగుల మందు తాగి మంగళవారం ఇద్దరు మృతి చెందారు.
కారణాలు తెలియవంటున్న పోలీసులు
కేసు నమోదు
నరసారెడ్డిపల్లె(చెన్నూరు) : చెన్నూరు మండలం ఉప్పరపల్లె పంచాయతీ నరసారెడ్డిపల్లె సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పురుగుల మందు తాగి మంగళవారం ఇద్దరు మృతి చెందారు. చెన్నూరు ఎస్‌ఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకొమ్మదిన్నె మండలం విశ్వనాథపురానికి చెందిన షేక్ ఖాదర్‌వలి(40), వీరబల్లి మండలం బొంగవాండ్లపల్లెకు చెందిన తంగెళ్ల వెంకటసుబ్బమ్మ(38)లకు ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉండేది. వీరు మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కూలిపని చేసుకొంటూ జీవించేవారు. మూడేళ్ల క్రితం ఊరొదిలి వెళ్లారు.
వెంకటసుబ్బమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కడపలో ఉంటూ హోటళ్లలో పని చేస్తున్నారు. వీరి మధ్య ఎలాంటి కలహాలు ఏర్పడ్డాయో ఇద్దరు కలిసి నరసారెడ్డిపల్లె సమీపంలోని బీడుపొలాల్లోకి సోమవారం రాత్రి చేరుకొని పురుగుల మందు తాగారు. ఉదయం ఉపాధి పనులకు వెళ్లిన ఉప్పరపల్లె, దుగ్గనపల్లె కూలీలు వీరి మృతదేహాలను గుర్తించి వీఆర్‌ఏ ఏసురాజుకి సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ హనుమంతు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని మృతికి కారణాలపై విచారిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.