మూడు వారాలైనా బడి మూతే..! | Tribal School Closed From Three Weaks In Prakasam | Sakshi
Sakshi News home page

మూడు వారాలైనా బడి మూతే..!

Jul 4 2018 11:38 AM | Updated on Jul 4 2018 11:38 AM

Tribal School Closed From Three Weaks In Prakasam - Sakshi

పాజర్ల ఎస్టీ కాలనీలో తెరుచుకోని పాఠశాల

గిరిజనుల అమాయకత్వం, ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారుల ఉదాసీనత వెరసి 45 మంది గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేశాయి. పాఠశాలలు తెరిచి 20 రోజులు అయినా ఆ గ్రామంలో మాత్రం రెండు నెలలు వరకు పాఠశాల తెరుచుకోదు. అప్పటి వరకు చిన్నారులు విద్యకు దూరంగా ఇళ్ళ వద్ద ఉండాల్సిందే. ఇది ఏటా జరిగే తంతే. రెక్కలు ముక్కలు చేసుకునైనా తమ పిల్లలను చదివించుకుందామన్న నిరుపేదల ఆశ అడియాశగా మారుతోంది. దీంతో అక్కడి పిల్లల భవిషత్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఈ సంఘటనే చెప్తోంది.

గుడ్లూరు: మండలంలోని పాజర్ల గ్రామం, ఎస్టీ కాలనీలో 150 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి కిలో మీటరు దూరంలో కాలనీ ఉండటంతో 20 సంవత్సరాల కిందట కాలనీలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్వంలో గిరిజన పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 30 నుంచి 45 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటున్నారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాల సక్రమంగా నడవడం లేదు. ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు సకాలంలో పాఠశాలకు వచ్చే వ్యక్తి కాదు. కాలనీ వాసులు రెండు సంవత్సరాలు క్రితం ఉన్నాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని స్థానంలో ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులు మహిళా ఉపాధ్యాయురాలును నియమించారు. ఆమె ఒక సంవత్సరం పాటు బాగానే చెప్పారు. ఆమె బదిలిపై వెళ్లడంతో రెండు సంవత్సరాలు నుంచి వస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు రాకపోవడం వల్ల విద్యార్థులకు మళ్లీ కష్టాలు తప్పడం లేదు.

ఉపాధ్యాయుడు ఎప్పుడు పాఠశాలకు వస్తాడో ఎప్పుడు రాడో కూడా తెలియదని ఇక్కడి కాలనీ వాసులు చెబుతున్నారు. గత సంవత్సరం కూడా రెండు నెలలు వరకు పాఠశాలను తెరవక పోవడంతో కొంత మంది తల్లిదండ్రులు 3, 4, 5 తరగతులు చదువుతున్న 15 మంది పిల్లలను 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న పోట్లూరులోని యూపీ పాఠశాలకు ఆటోలో పంపుతున్నారు.  1, 2 తరగతులు చదువుతున్న మిగతా 30 మంది చిన్నారులు ఇళ్ళ వద్దే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా పాఠశాలలు తెరిచి 20 రోజులు అయినా కాలనీలో ఉన్న పాఠశాల ఇప్పటి వరకు తెరుచుకోలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను బాగా చదివించుకోవాలని ఆశ ఉన్నా ఉపాధ్యాయుడు రాక పోవడంతో నిస్సహాయంగా ఉండాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలకు పంపలేని పరిస్థితి తమదని వారు వాపోయారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఉపాధ్యాయుడు పాఠశాలకు సక్రమంగా రావడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఈ పాఠశాల గురించి ప్రజాప్రతినిధులు కాని అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు.  ఇప్పటికైనా అధికారులు తమ గోడును ఆలకించి పాఠశాలను తెరిచి ఉపాధ్యాయుడు ప్రతి రోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఏటా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాం
పాఠశాలను సక్రమంగా నడపక పోవడంపై గత సంవత్సరం నుంచి ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని మండల విద్యాశాఖాధికారి కల్లయ్య తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు పాఠశాలను తెరవలేదని సమాచారం అందించాం. దీనిపై డీఈఓకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

పాఠశాలను త్వరగా తెరిపించాలి
రెండు సంవత్సరాలు నుంచి పాఠశాలను సరిగా తీయక పోవడం వల్ల మా ముగ్గురు కుమార్తెలను ఆటోలో పొట్లూరులోని పాఠశాలకు పంపుతున్నాం. రోడ్డు కూడా బాగాలేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది. పాఠశాలను త్వరగా తెరిపించాలి.–హేమ, కాలనీ వాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement