హృదయ విదారకం..

A Tragedy Of Corona Death In Palasa - Sakshi

పలాస కంటైన్‌మెంట్‌ జోన్‌లో వృద్ధుడి మృతి

మృతదేహానికి పరీక్షలు చేసిన వైద్యాధికారులు

అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్‌ ఫలితం

మృతదేహాన్ని విడిచి పరుగులు పెట్టిన బంధువులు

జేసీబీతో మృతదేహం తరలింపు.. బాధ్యులపై చర్యలు 

కాశీబుగ్గ: పదమూడు మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం వారిది. అప్పటి వరకు కలిసిమెలిసి జీవనం సాగించిన ఆ కుటుంబంలో కోవిడ్‌–19 వైరస్‌ చిచ్చు రేపింది. వారి అనుబంధాల్ని, ఆప్యాయతల్ని ప్రశ్నించింది. కరోనా వైరస్‌ పాజిటివ్‌తో ఆ కుటుంబ పెద్ద మృతి చెందితే... ఏం చేయాలో పాలుపోక.. మృతదేహం దగ్గరికి వెళ్లడానికే భయపడ్డారు. అప్పటివరకు స్నేహాన్ని పంచిన ఆ పెద్దాయన్ని చూసేందుకు కాలనీవాసులూ వెనుకంజ వేశారు. మరోవైపు.. మృతదేహాన్ని మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో తరలించడాన్ని చూసి వారి హృదయం తల్లడిల్లింది. ఈ హృదయవిదారక సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.  

ఏం జరిగిందంటే...
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం సమీపాన రాజమ్మకాలనీలో శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ ప్రాంతం కంటైన్‌మెంట్‌ జోన్‌ కావడంతో డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ లీల ఆదేశాల మేరకు అంత్యక్రియలకు ముందు వైద్యాధికారులు మృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించి అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్‌ల ద్వారా కరోనా ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించారు. 

అప్పటివరకు కలివిడిగా...
సంప్రదాయం ప్రకారం మృతదేహానికి అంత్యక్రియలకు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు పూర్తి చేశారు. మృతదేహాన్ని ఒక కిలోమీటరు దూరంలో ఉన్న స్థానిక శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా వైద్యులు ఫోన్‌ కాల్‌ ద్వారా ట్రూనాట్‌ పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని తెలిపారు. అంతే... అప్పటివరకు కలివిడిగా ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు, కాలనీవాసులు సహా అక్కడి నుంచి భయంతో పరుగులు పెట్టారు. నడిరోడ్డుపై మృతదేహాన్ని విడిచి వెళ్లిపోయారు. 

జేసీబీతో తరలింపు...
వైద్య, రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు సంఘటన ప్రాంతానికి వచ్చిన మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీకి చెందిన జేసీబీతో శ్మశానానికి తరలించారు. ఉన్నతాధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండానే జేసీబీతో తరలించడం కలకలం రేపింది. 

బాధ్యులపై చర్యలు 
పలాస–కాశీబుగ్గలో జరిగిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్‌ నివాస్‌... పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌లను తక్షణమే సస్పెండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top