
గూటాల–కొత్త పట్టిసీమ గ్రామాల మధ్య నిలిచిన ట్రాఫిక్
పశ్చిమగోదావరి, పోలవరం రూరల్ : కొవ్వూరు నుంచి పోలవరం వెళ్లే ఏటిగట్టుపై ప్రయాణం అంటే ప్రయాణికులు, వాహనచోదకులు హడలిపోతున్నారు. రోడ్డు వెడల్పు తక్కువ కావడం, ట్రాఫిక్ భారీగా పెరగడంతో ప్రయాణం కత్తిమీద సాములా మారింది. ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే తప్పుకునేందుకు వీలులేకుండా ఉండడం, మరోపక్క గోదావరి కావడంతో భారీ వాహనాల డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా ప్రకటనలకే పరిమితమైంది. ఏడు సంవత్సరాలుగా కనీస మరమ్మతులు కూడా లేవు. ఏటిగట్టు వాసులు నిత్యం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు.
ధ్వంసమవుతున్న రహదారి
పోలవరం నుంచి ప్రక్కిలంక వరకు 15 కిలోమీటర్ల పొడవునా ఏటిగట్టు మార్గం ఉంది. ఈ మార్గమే పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే ప్రధానదారి. ఈ మార్గంలో గూటాల నుంచి కొత్త పట్టిసీమ వరకు మూడున్నర మీటర్లు మాత్రమే రోడ్డు వెడల్పు ఉంది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారులు ఈ ప్రాంతం చేరే సరికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లే పరిస్థితి లేదు. రోడ్డు పక్కనే నివాసాలు. దుమ్ము ధూళితో నానా అవస్ధలు పడుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే భారీ వాహనాలు, సందర్శకులను తీసుకువచ్చే బస్సులే కాక నిత్యం తిరిగే వాహనాలతో ట్రాఫిక్ ఎక్కువైంది. దీంతో ఆర్‌అండ్‌బీ రోడ్డు రోజురోజుకూ దెబ్బతింటోంది.
నిత్యం 200 బస్సుల్లో సందర్శకుల రాక
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నిత్యం రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి 200 నుంచి 250 బస్సుల్లో సందర్శకులు తరలివస్తున్నారు.ప్రాజెక్టు పనులకు అవసరమైన సిమెంట్ తరలించే భారీ లారీలు, యంత్రాలు, ఐరన్ తరలించే అతిభారీ లారీలు ఈ రోడ్డు మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాహనాలన్నీ ఈ సింగిల్ రోడ్డులోనే రాకపోకలు సాగించడంతో రోడ్డు బాగా దెబ్బతింది.
ప్రకటనలకే పరిమితమైన సీఎం హామీ
పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పోలవరం ప్రాంత ప్రజలు, నాయకులు ఏటిగట్టు రోడ్డు పరిస్థితిని నాలుగు సంవత్సరాల క్రితం తెలియజేశారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్డు నిర్మాణం మాట దేవుడెరుగు. కనీసం ప్యాచ్‌వర్క్ పనులకు కూడా నోచుకోలేదు. సీఎం హామీ కూడా అమలు జరగలేదు.
ప్రతిపాదనలతో సరి
పోలవరం నుంచి కొవ్వూరు వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. 20 మీటర్లు వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి రూ.320 కోట్ల అంచనాలతో మూడు సంవత్సరాల క్రితం ప్రతిపాదనలు ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. 2017లో ఈ రోడ్డు నేషనల్ హైవే రోడ్డుగా గుర్తించబడింది. జీలుగుమిల్లి నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వరకు 85 కిలోమీటర్ల పొడవునా నేషనల్ హైవే నిర్మాణానికి రూ. 493 కోట్లతో మరో ప్రతిపాదన పంపారు. రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నేటికీ ఈ రోడ్డు పరిస్థితిని పట్టించుకున్నవారు లేరు.
అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ఏటిగట్టు రోడ్డుపై ట్రాఫిక్‌జామ్ కావడంతో నిత్యం గూటాల కొండ్రు వీధి నుంచి కొత్త పట్టిసీమ వరకు గ్రామం మధ్యలో ఉన్న రోడ్డుమార్గంలో వాహనాలు రాకపోకలు సాగించడంతో ఈ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ ఇదే పరిస్థితి ఏర్పడుతోందని, ఒకవైపు ఏటిగట్టు రోడ్డు, మరో వైపు గ్రామంలో ఉన్న రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. మరోవైపు దుమ్ముధూళితో నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోడ్డుకు ఒకవైపు ఏజీఆర్‌బీ గట్టు, మరోవైపు ఆర్‌అండ్‌బీ రోడ్డు, రోడ్డు దిగువనే ప్రజలు నివశిస్తున్న నివాసాలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డును వెంటనే నిర్మించాలి
గూటాల కొత్తపట్టిసీమ గ్రామాల మధ్య ఏటిగట్టు రోడ్డుపై నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఈ రోడ్డు మార్గంలో ఒక వాహనం వస్తే మరో వాహనం తప్పుకునే పరిస్థితి లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమయంలో గ్రామం మధ్యలో వాహనరాకపోకలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డును నిర్మించాలి. – కరిబండి నాగేశ్వరరావు, గూటాల
ప్రమాదకరంగా రహదారి
పోలవరం నుంచి ప్రక్కిలంక వరకు ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నాం. నిత్యం పోలవరం సందర్శనకు వచ్చే బస్సులతో పాటు భారీ వాహనాలతో రోడ్డుమార్గంలో కనీసం తప్పుకునే పరిస్థితి ఉండటం లేదు. అతివేగంగా బస్సులు రావడం కూడా ప్రమాదకరంగా మారింది. పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రోడ్డును వెడల్పు చేయాలి.– తెలగంశెట్టి సూర్యచంద్రం, పట్టిసీమ