ట్రాక్టర్.. బైక్ ఢీ యువకుడి మృతి | Tractor .. Bike collided young man killed | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్.. బైక్ ఢీ యువకుడి మృతి

Jan 3 2014 1:17 AM | Updated on Sep 2 2017 2:13 AM

మండలంలోని వెల్లటూరు జీవన్‌నగర్ సమీపంలో గురువారం తెల్లవారు జామున ట్రాక్టర్.. బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

వెల్లటూరు(జి.కొండూరు), న్యూస్‌లైన్ : మండలంలోని వెల్లటూరు జీవన్‌నగర్ సమీపంలో గురువారం తెల్లవారు జామున ట్రాక్టర్.. బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మేరీ మాత ఊరేగింపు సందడిగా ఉన్న సమయంలో ఈఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో  విషాదచాయలు అలముకున్నాయి.  వివరాల్లోకి వెళ్తే ఉత్సవాల్లో భాగంగా లడ్డు ప్రసాదాలు పంపిణీ చేసే నిమిత్తం గ్రామ మాజీ వైస్ సర్పంచి వెలిసిల జోజి తనయుడు వెలిసిల శివాజీరాజు(23)తో పాటు  వెలిసిల కిషోర్(20) తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో బైక్‌పై చివరి మాలపల్లి నుంచి గ్రామంలోకి  వస్తున్నారు.

ఈ క్రమంలో జీవన్ నగర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఏదురుగా ఉత్సవాలు ముగించుకుని  వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ ట్రక్ డోర్ల  కింద పెట్టిన కర్ర బాదులు బైక్ నడుపుతున్న శివాజీ రాజుకు తగలడంతో అతని పొట్ట భాగంనుంచి  పేగులు బయటపడి అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడిన కిషోర్‌ను రోడ్డు  పక్కకు లాగి ఏమీ తెలియనట్టుగా జీవన్ నగర్‌లో ఉన్న అతని ఇంటికి  వెళ్లిపోయాడు.

అనంతరం కొద్ది సేపటి తరువాత  రోడ్డుపై నెత్తుటి మడుగులో ఉన్న ఇరువురినీ స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిందనుకున్న గ్రామస్తులు కిషోర్‌ను 108 వాహనంలో మైలవరం ప్రభుత్వ  ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రమాదానికి కారణమయిన ట్రాక్టర్‌పైనే ప్రయాణిస్తున్న వారిలో ఒకరు జరిగిన విషయాన్ని గ్రామస్తులకు  తెలిపాడు.

దీంతో  గ్రామస్తులు ఉదయం 8 గంటలకు డ్రైవర్ ఇంటివద్ద ఉన్న  ట్రాక్టర్‌ను పరిశీలించగా  ట్రక్ పై నెత్తురు మరకలు కనిపించాయి.రంగంలో దిగిన పొలీసులు ముందు జాగ్రత్తగా ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. శివాజీరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ఆస్పత్రికి తరలించారు. శివాజీరాజు ప్రస్తుతం ఎంబీఏ పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. కుటుంబంలో విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement