పల్లె పులకింత

Towns people went to Villages for Sankranti Festival - Sakshi

సంక్రాంతికి సొంతూళ్లకు పట్టణవాసులు 

కుటుంబ సమేతంగా విదేశాల నుంచి కూడా రాక 

ఇళ్ల ముందు రంగవల్లులు, పూలతో ముస్తాబవుతున్న గొబ్బెమ్మలు 

గ్రామాల్లో సందడే సందడి.. 

ఊపందుకుంటున్న కోడి పందాలు, ప్రభల తీర్థాలకు సిద్ధం  

బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఇంకా కొనసాగుతున్న రద్దీ

ఎన్నాళ్ల నిరీక్షణో ఇది.. సంక్రాంతి రూపంలో ఫలించింది. బతుకుపోరులో సుదూరాలకు తరలి వెళ్లిన తన బిడ్డ పాదాన్ని పల్లెతల్లి మళ్లీ సుతారంగా ముద్దాడింది. ఏడాదికోసారి ఊరికి ఉత్సవాన్ని తెస్తున్న ఆ బిడ్డను చూసి పులకించిపోయింది. ఉద్వేగంతో గుండెలకు హత్తుకుంంది. పుట్టి పెరిగిన నేలపైకి కాలుమోపగానే.. ఆ బిడ్డకూ ఏదో నూతనోత్తేజం. పైరగాలి తాకి తనువు పరవశించింది. పచ్చదనాన్ని పరుచుకున్న పొలాల్ని చూసి హృదయం ఉప్పొంగింది. ఓ వైపు.. పక్షుల కిలకిలారావాలు.. ఎక్కడో సుదూర తీరాన చెట్టుపై నుంచి లీలగా వినిపిస్తున్న కోయిలమ్మ కూనిరాగాలు. ఎహే... అంటూ ముల్లుగర్రతో ఎద్దును అదిలిస్తున్న రైతన్న కేకలు.. మరోవైపు.. ఇళ్ల ముందు రంగవల్లులు.. ఆ ముగ్గుల సిగలో గుమ్మడి పువ్వులతో ముస్తాబైన గొబ్బెమ్మలు.. పలుకే బంగారమాయెరా కోదండరామా.. అంటూ వీధుల్లో వీనుల విందుగా భక్తిపారవశ్యంలో తేలియాడిస్తున్న హరిదాసు కీర్తనలు.. లంగాఓణీల్లో పల్లె పడుచుల కేరింతలు.. పిండివంటల ఘుమఘుమలు.. పేక ముక్కల కోతలు.. కోడి పందేలు..

అమలాపురం: గ్రామాల్లో ఎటు చూసినా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లినవారు... వేలాది రూపాయల ప్రయాణ భారాన్ని లెక్కచేయకుండా సొంత ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో పట్టణవాసులు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. చివరి నిమిషంలో బయలుదేరిన వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇంకా కిటకిటలాడుతూనే ఉన్నాయి. బస్సులు, విమాన చార్జీలను ఒక్కసారిగా పెంచేయడంతో హైదరాబాద్, చెన్నై, విశాఖ వంటి నగరాల్లో ఉన్న వారు సొంతకార్లలో ఊళ్లకు చేరుకుంటున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లండ్‌ తదితర దేశాల్లో ఉన్న వారు సైతం కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరం, విశాఖ.. ఇలా నగరాలు, పట్టణాలన్నీ నూతన వస్త్రాలు కొనుగోలు చేసేవారితో కిటకిటలాడుతుంటే సోమవారం భోగి పండుగ కావడంతో గ్రామాల్లో పండగ సందడి పతాక స్థాయికి చేరింది. ఆడపడుచులు ఇళ్ల ముంగిట ముగ్గులతో పోటీ పడుతుంటే మగవారి కోసం కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి.
       
ప్రభల తీర్థం ప్రత్యేకం 
తూర్పుగోదావరి అనగానే గుర్తుకొచ్చేది ప్రభల తీర్థం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమలో సంక్రాంతి పండుగ మూడురోజులూ పెద్ద ఎత్తున ప్రభల తీర్థాలు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు వంటి ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్న చిన్న తీర్థాలు జరిగినా.. ఒక్క కోనసీమలోనే 90 వరకు తీర్థాలు జరుగుతాయి. వీటి నిర్వహణలో కోనసీమ సంప్రదాయం ఉట్టిపడుతుంది. అంబాజీపేట మండలం జగ్గన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంటల్లో జరిగే ప్రభల తీర్థాలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు ఈ తీర్థాలకు తప్పనిసరిగా హాజరవుతుంటారు. 20 అడుగుల వెడల్పు, 42 అడుగుల ఎత్తున భారీ ప్రభలను తయారుచేసి కుల, మతాలకు అతీతంగా భక్తులు తీర్థాలకు తరలించుకొస్తారు. పంటపొలాలు, పంట బోదెలు, కౌశికలు దాటుకుని ప్రభలు వచ్చే తీరు అద్భుతంగా ఉంటుంది. కోడి పందేలు ఇప్పటికే జరుగుతుండగా.. పండుగ వేళ భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోడి పందేలకు అనుమతిచ్చేది లేదని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు లెక్కచేయడం లేదు. బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేలతో పాటు పొట్టేలు పందేలు, గుండాటలకు సైతం రంగం సిద్ధమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top