పట్టణంలో నిరాధరణకు గురవుతున్న గోవులకు వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమానాగిరెడ్డి ఆధ్వర్యంలో గో సంరక్షణశాల ఏర్పాటుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
నంద్యాల, న్యూస్‌లైన్: పట్టణంలో నిరాధరణకు గురవుతున్న గోవులకు వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమానాగిరెడ్డి ఆధ్వర్యంలో గో సంరక్షణశాల ఏర్పాటుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక సురక్షిత స్థలాన్ని ఎంపిక చేశారు. 15 రోజుల నుంచి పట్టణంలోని అపరిశుభ్రతకు కారణమైన అంశాలను ప్రజల నుంచి తెలుసుకొని వాటిని తొలగించే కార్యక్రమంలో భూమా నిమగ్నమయ్యారు. మొదటి దశలో పట్టణంలోని 50వేల కుటుంబాలకు మేలు చేకూర్చడానికి పందులను పట్టణ శివార్లకు తరలించే కార్యక్రమంలో విజయం సాధించిన భూమా రెండో విడతలో గోవుల తరలింపునకు శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ఆయన నివాసంలో గోవుల ప్రేమికులను ఆహ్వానించి వారితో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డితో పాటు గో సంరక్షణ నాయకులు బసవరాజు, సుధాకర్, మాలేపాటి రాజశేఖర్ తదితరులు పాల్గొని తమ సలహాలను అందజేశారు.
రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గోవులను ఇప్పటికిప్పుడు ఇతర ప్రాంతాలకు తరలించడం సాధ్యం కాదని అందుకు ఎస్‌బీఐ కాలనీలోని తన సొంత స్థలం ఉందని ఏడాది కాలం తాత్కాలిక గోశాలను ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చని భూమాకు సూచించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ కాలనీకి వెళ్లి తాత్కాలికంగా ఏర్పాటు చేసే గో సంరక్షణ ఆశ్రమాన్ని భూమా సందర్శించారు. క్లీన్‌సిటీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని భూమా అన్నారు. పొక్లెయీన్లతో పదిహేను రోజుల నుంచి కంపచెట్లు ఉన్న స్థలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు.